ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్‌ చేసిన ఢిల్లీ పోలీసులు  

ఇద్దరు జర్నలిస్టులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేస్తున్న హర్యానా-ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన సింఘు వద్ద మన్‌దీప్ పునియా, ధర్మేంద్ర సింగ్ అనే ఇద్దరు జర్నలిస్టులను పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

విధుల్లో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కారవాన్ పత్రికకు కథనాలు రాసే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మన్‌దీప్‌ను శనివారం రాత్రంతా సమయపూర్ బద్లీ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఆదివారం ఉదయం తీహార్ కోర్టు కాంప్లెక్స్ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు ఆయనను హాజరుపర్చగా పూచీకత్తుపై విడుదల చేశారు.

మరోవైపు రిపబ్లిక్‌ డే రోజున ట్రాక్టర్‌ ర్యాలీ ప్రమాదంలో మరణించిన డ్రైవర్‌ పోలీస్‌ కాల్పుల్లో చనిపోయినట్లు తప్పుడు ట్వీట్లు చేసిన కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌తోపాటు ఆరుగురు సీనియర్‌ జర్నలిస్టులపై శనివారం ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు.  కాగా, పలువురి జర్నలిస్టులపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఖండించింది. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులన్నాయని ఆరోపించింది.