రామాలయంకు విరాళాలు సేకరిస్తున్నవారిపై దాడి

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం విరాళాలను సేకరిస్తున్నవారిపై బెంగళూరులో కొందరు దాడి చేశారు. బాధితుల కథనం ప్రకారం, గురప్పనపాలయలో ఈ దాడి జరిగింది. మొదట మాటలతో ప్రారంభమైన ఈ కలహం స్థానికుల జోక్యంతో సద్దుమణిగింది. దాదాపు 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బీజేపీ బెంగళూరు సౌత్ యూనిట్ ప్రధాన కార్యదర్శి వి సుదర్శన్ మాట్లాడుతూ, అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం తాము 15 రోజుల నుంచి ఇంటింటికీ వెళ్ళి విరాళాలను సేకరిస్తున్నామని చెప్పారు. గురప్పనపాలయలో నిధుల సేకరణ కోసం ఓ హిందూ సంస్థ కార్యకర్తలు వెళ్ళారని చెప్పారు. 

వారు శ్రీరాముని బొమ్మ ఉన్న వాహనంలో వెళ్లి విరాళాలు సేకరిస్తున్నారని చెప్పారు. గురప్పనపాలయ పెట్రోలు బంకు వద్ద కొందరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారని, అనంతరం రాళ్ల దాడికి పాల్పడ్డారని చెప్పారు. 

శుక్రవారం మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులను నిందితులుగా చేర్చారు. నేరపూరితంగా బెదిరించడం, మతపరమైన అశాంతిని ప్రేరేపించడం, చట్టవిరుద్ధంగా గుమిగూడటం, అల్లర్లకు పాల్పడటం తదితర నేరారోపణలను నమోదు చేశారు. 

నిందితులను 24 గంటల్లోగా అరెస్టు చేయాలని సుదర్శన్ డిమాండ్ చేశారు. నిందితులను 24 గంటల్లోగా అరెస్టు చేయకపోతే, తాము పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తామని చెప్పారు. నిందితులను తాము గుర్తించగలమని తెలిపారు.