పుల్వామా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని అవంతిపోర ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా మండూర ట్రార్ ఏరియాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
గాలింపు చర్యలు కొనసాతున్నట్టు చెప్పారు. మండూర గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు గురువారం తమకు సమాచారం అందిందని, దీంతో పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని కశ్మీర్ ఐజీ తెలిపారు.
 
 ఉగ్రవాదులను లొంగిపోవాల్సిందిగా హెచ్చరికలు చేసినప్పటికీ వారు ఖాతరు చేయకుండా గ్రనేడ్ విసరడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని, హిజ్‌బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోందని ఐజీ తెలిపారు.
కాగా, పుల్వామాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన మరో ఎన్‌కౌంటర్‌ లో ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా బలగాలకు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఇద్దరు ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే-47 రైఫిల్స్‌తో పోలీసు, భద్రతా దళాల సీనియర్‌ అధికారుల ముందు లొంగిపోయారని కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ఓ ఉగ్రవాదిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.