దేశంలో ఈ నెల 16న వాక్సినేషన్ ను ప్రారంభించిన తర్వాత 12 రోజులలో 25 లక్షల మందికి పైగా టీకాలు వేసి భారత్ రికార్డు ఏర్పరిచింది. ఈ నెల 28, మధ్యాహ్నం 2 గంటల నాటికి దేశవ్యాప్తంగా 25,07,556 మందికి టీకా వేశారు. తొలి ఆరు రోజుల్లో ఏకంగా పది లక్షల మందికి పైగా టీకాలు వేసి, అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన దేశంగా రికార్డులకెక్కిందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. కరోనా వైరస్ పోరులో భాగంగా ఈ నెల 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ చురుగ్గా సాగుతోంది.
అమెరికా 10 రోజుల్లో 10 లక్షల మందికి టీకాలు వేయగా, స్పెయిన్ 12 రోజుల్లో, ఇజ్రాయెల్ 14 రోజుల్లో, యూకే 18 రోజుల్లో, ఇటలీ 19 రోజుల్లో, జర్మనీ 20 రోజుల్లో, యూఏఈ 27 రోజుల్లో ఈ ఘనత సాధించాయి. వ్యాక్సినేషన్‌లో రాజస్థాన్, ఒడిశా వంటి రాష్ట్రాలు బాగా పనిచేస్తున్నాయని కితాబిచ్చిన కేంద్రం.. ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు మెరుగుపడాల్సి ఉందని పేర్కొంది.
ఒడిశా, హర్యానా, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఆరోగ్య కార్యకర్తలకు 35 శాతానికిపైగా వ్యాక్సినేషన్ కవరేజ్‌తో చక్కగా పనిచేస్తున్నాయని ప్రశంసించింది. తమిళనాడు, ఢిల్లీ, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో 21 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ కవరేజ్ అయినట్టు పేర్కొంది. వారి పనితీరు మరింత మెరుగుపడాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాగా, భారతదేశంలోని కోవిడ్ -19 కేసుల్లో 70 శాతం మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ తెలిపారు. మహారాష్ట్ర కరోనా వైరస్ సంఖ్య 20,15,524 ఉండగా, కేరళలో మొత్తం 9,05,591 కేసులు ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
దేశంలో కరోనా ఉద్ధృతి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. వైరస్ వ్యాప్తి, మరణాల రేటులో క్రమంగా క్షీణత కనిపిస్తున్నది. గత వారం రోజులుగా నమోదైన కొత్త కేసులను విశ్లేషిస్తే, దేశవ్యాప్తంగా రోజుకు సగటున 12 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.
146 జిల్లాల్లో గత ఏడు రోజుల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం జిల్లాల్లో ఇది ఐదో వంతు. 18 జిల్లాల్లో రెండు వారాలుగా, ఆరు జిల్లాల్లో మూడు వారాలుగా, 21 జిల్లాల్లో నాలుగు వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదని హర్షవర్ధన్ తెలిపారు.
More Stories
రైలును పట్టాలు తప్పించేందుకు మరోసారి కుట్ర
మెరీనా బీచ్ వద్ద ఎయిర్ షోలో తోక్కిసలాట.. ఐదుగురు మృతి
ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్లకే శబరిమల అయ్యప్ప దర్శనం