హింస‌ను ప్రేరేపించే టీవీ వార్తల‌ను నియంత్రించాలి 

ప్ర‌జ‌ల్లో హింస‌ను ప్రేరేపించే టీవీ ప్రోగ్రామ్‌ల‌ను, వార్తల‌ను నియంత్రించాల‌ని సుప్రీంకోర్టు ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశాల‌కు సంబంధించిన చ‌ట్టాల‌ను క‌ఠిన‌త‌రం చేయాల‌ని కోర్టు పేర్కొన్న‌ది.  శాంతిభ‌ద్ర‌తల‌ అంశంలో నియంత్ర‌ణ కీల‌క‌మైంద‌ని, ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేక‌పోయింద‌ని కోర్టు పేర్కొన్న‌ది. చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ ఆదేశాలు జారీ చేసింది.

జ‌స్టిస్ ఏఎస్ బొప్ప‌న్న‌, వీ రామ‌సుబ్ర‌మ‌ణియ‌న్ ఆ ధ‌ర్మాస‌నంలో ఉన్నారు.  నిష్పాక్షి, వాస్త‌విక‌మైన రిపోర్టింగ్‌తో స‌మ‌స్య లేద‌ని, కానీ ఇత‌రుల‌ను రెచ్చ‌గొట్టే విధంగా ప్ర‌సారాలు చేయ‌డం స‌మ‌స్య అని సీజే బోబ్డే తెలిపారు. ఢిల్లీలో జ‌రిగిన త‌బ్లీగ్ జ‌మాత్ స‌మావేశాల‌పై గ‌త ఏడాది మీడియా క‌థ‌నాల‌ను ప్ర‌శ్నిస్తూ జ‌మాతే ఉలేమా ఇ హింద్, పీస్ పార్టీలు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాయి. త‌బ్లీగ్ స‌మావేశాన్ని వ‌ర్గం పేరుతో దూషించినట్లు వార్త‌లు ప్ర‌సారం అయ్యాయి.

అయితే రెచ్చ‌గొట్టే కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌భుత్వం అడ్డుకోవాల‌ని సీజే బొబ్డే త‌న తీర్పులో తెలిపారు. రెండు రోజుల క్రితం గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున జ‌రిగిన ట్రాక్ట‌ర్ ర్యాలీ నేప‌థ్యంలో ఢిల్లీలో ఇంట‌ర్నెట్‌ను బంద్ చేశారు. ఈ అంశాన్ని సీజే ప్ర‌స్తావించారు.

రైతుల ర్యాలీ ఉంద‌ని ఇంటర్నెట్‌ను మూసివేశార‌ని, అయితే మీ ఫోక‌స్ రైతుల మీద లేద‌ని, కానీ ఇంట‌ర్నెట్ మొబైల్‌ను నిలిపేసార‌న్నారు.  ఇలాంటి స‌మ‌స్య‌లు ఎక్క‌డైనా వస్తాయ‌ని పేర్కొన్నారు.  కేబుల్ టెలివిజ‌న్ నెట్వ‌ర్క్ రెగ్యులేష‌న్ యాక్ట్‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఆ చ‌ట్టంలో ఒక లైన్ జోడించినా మార్పు వ‌స్తుంద‌ని న్యాయ‌మూర్తులు అభిప్రాయ‌ప‌డ్డారు.