`తాండవ్’ బృందానికి రక్షణకు సుప్రీం తిరస్కారం 

వివాదాస్పదమైన వెబ్ సిరీస్ `తాండవ్’ బృందానికి అరెస్ట్ నుండి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తరువులు జారీ చేయడానికి సుప్రీం కోర్ట్  తిరస్కరించింది. దానితో వారు అరెస్ట్ కు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

తాండవ్ సీరియల్‌లో హిందువుల మనోభావాలను గాయపరిచే అంశాలున్నాయంటూ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, అమేజాన్ ప్రైమ్ ఇండియా చీఫ్ అపర్ణా పురోహిత్, నిర్మాత హిమాన్షుమెహ్రా, తదితరులపై దేశంలోని వివిధ నగరాలలో ఎఫ్‌ఐఆర్ నమోదయ్యాయి. 

ముందస్తు బెయిల్ కోసం లేదా ఎఫ్‌ఐఆర్ ల రద్దు కోసం సంబంధిత రాష్ట్రాల హైకోర్టులను సంప్రదింపమని సుప్రీం కోర్ట్ వారికి సూచించింది. వివాదాస్పదమైన భాగాలను తొలగిస్తామని నిర్మాతలు ఇప్పటికే హామీ ఇచ్చారు. 

దీనిపై బుధవారం విచారణ జరిపిన జస్టిస్ అశోక్‌భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ ప్రభుత్వాలకు తమ స్పందన తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. 

తొమ్మిది ఎపిసోడ్‌లతో కూడిన తాండవ్ సీరియల్‌లో రాజకీయ అంశాలున్నాయి. ఈ నెల 15న విడుదలైన ఈ సిరీస్ లోని అంశాల పట్ల అనేకమంది తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సీరియల్‌లో బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, డింపుల్ కపాడియా, మహ్మద్ జీషన్ ఆయూబ్‌లాంటివారు నటించారు.