ఈ నెల 31వ తేదీ వరకు ఎర్రకోటను మూసివేస్తూ భారతీయ పురాతత్వశాఖ (ఏఎస్‌ఐ) ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రోజుల్లో ఎర్రకోటలోకి పర్యాటకులకు అనుమతి ఉండదని పేర్కొంది. అయితే మూసివేతకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
ఇటీవల ఢిల్లీలో బర్డ్‌ఫ్లూ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు చారిత్రక ప్రదేశాన్ని మూసివేశారు. అలాగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా 22వ తేదీ నుంచి 26 మూసివేశారు. 27వ తేదీ నుంచి మళ్లీ సందర్శకులకు అనుమతి ఇవ్వాల్సి ఉండగా, ఈ నెల 31 వరకు మూసివేస్తూ పురాతత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రిపబ్లిక్ డే రోజున వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు నిర్వహించిన పరేడ్ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ యువరైతు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి మృతి చెందాడు. అంతేకాకుండా ఆందోళనకారులు ఎర్రకోటను ముట్టడించి ఆధ్యాత్మిక జెండాలను ఎగురవేశారు.
వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హింసాకాండ అనంతరం జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకే ఎర్రకోటను మూసివేసినట్లు పురావస్తు శాఖ వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించి, నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందజేయాలని ఏఎస్‌ఐని ఆదేశించారు. ఈ మేరకు చారిత్రక ప్రదేశాన్ని మూసివేసినట్లు తెలుస్తోంది.
రైతుల ఆందోళన సందర్భంగా ఎర్రకోటలో మెటల్ డిటెక్టర్లు, టికెట్ కౌంటర్లు, అద్దాలు ధ్వంసమయ్యాయి. ఢిల్లీలో 173 స్మారక చిహ్నాలు భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ) ఆధీనంలో ఉన్నాయి. ఇందులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఎర్రకోట, హుమాయున్ టూంబ్, కుతుబ్ మినార్ ఉన్నాయి.
More Stories
భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారులు 90 కోట్లు
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష