శిరోమణి అకాలీదళ్ (సాద్) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ వాహనంపై పంజాబ్‌లోని జలాలాబాద్ ప్రాంతంలో మంగళవారంనాడు దాడి జరిగింది. బాదల్ కారుపై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి జరపగా, మరికొందరు కర్రలతో దాడికి దిగారు.
బాదల్ కారుపై కాల్పులు జరిపినట్టు కూడా శబ్దాలు వినిపించాయి. దాడి ఘటనతో జనం పరుగులు తీశారు. ఈ ఘటన నుంచి బాదల్ సురక్షితంగా బయటపడినట్టు సమాచారం. కాగా, బాదల్ ప్రాణాలు తీసేందుకు పోలీసుల వెన్నుదన్నుతో కాంగ్రెస్ గూండాలే ఈ దాడి జరిపినట్టు ‘సాద్’ ఆరోపించింది. బాదల్‌ను కాపాడే ప్రయత్నంలో ముగ్గురు సాద్ కార్యకర్తలకు బుల్లెట్ గాయాలైనట్టు తెలిపింది.
పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు పార్టీ అభ్యర్థులతో కలిసి జలాలాబాద్ ఎస్‌డీఎం కార్యాలయానికి బాదల్ వెళ్లినప్పుడు దాడి ఘటన చోటుచేసుకుంది.
దీనికి ముందు సాద్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఇది రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిందని చెబుతున్నారు. బాదల్ కారుపై దాడి ఘటనతో పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఘర్షణలు చెలరేగడానికి కారణాలపై విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటనను శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనను నిరసిస్తూ చౌరస్తాలో బాదల్ తన అనుచరులతో ధర్నా చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే అకాలీదళ్ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తిప్పి కొట్టింది. ఈ ఘటనకు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ బాధ్యత వహించాలని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
More Stories
అమిత్ షాపై కెనడా ఆరోపణలపై భారత్ అసంతృప్తి
మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం కచ్చితం
అమలుకాని హామీలతో దుస్థితిలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు