వ్యవసాయంకు అండగా నిలిచేలా బడ్జెట్‌

బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రకటించిన చర్యల పట్ల కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి అండగా నిలిచేలా బడ్జెట్‌ను రూపొందించారని అంటూ ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ను ప్రశంసించారు. “ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం పనిచేయడానికి కట్టుబడి ఉన్నది. ప్రతి సంవత్సరం పెరిగిన బడ్జెట్ కేటాయింపులపై మాత్రమే కాకుండా.. పథకాల అమలుపై కూడా దృష్టి పెడుతున్నది” అని ఆయన తెలిపారు.
రైతులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు సెస్‌ విధించేందుకు కేంద్రం ఎంతో ధైర్యం చేసిందని కొనియాడారు. కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన పలు అనుమానాలను కూడా బడ్జెట్ నివృత్తి చేసిందని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఇలాంటి బడ్జెట్‌ తీసుకువచ్చిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలమ్మలను ఆయన ప్రశంసించారు. రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించడం పట్ల సంతోషం ప్రకటించారు.
‘వ్యవసాయ రుణ లక్ష్యాన్ని ప్రభుత్వం రూ.16.5 లక్షల కోట్లకు పెంచింది. 2020-21లో రూ.15 లక్షల కోట్ల నుంచి 10 శాతం పెరిగింది. వ్యవసాయ రుణ లక్ష్యం రూ.7 లక్షల కోట్లు ఉండగా.. ఇది గత సంవత్సరం రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు దానిని మరింత పెంచారు. ఇది రైతులు, మత్స్యకారులు మరియు పాడి రైతులకు సులభంగా రుణలను అందివ్వడంలో ఉపయోగపడుతుంది’ అని నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు.
వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్ (ఏఐడీసీ) ను పెట్రోల్‌పై లీటరుకు రూ.2.5, డీజిల్‌కు రూ.4 చొప్పున కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. అయితే, అదనపు ఖర్చులతో వినియోగదారులపై భారం పడకుండా తగిన శ్రద్ధ వహించినట్లు తోమర్ తెలిపారు.