దేశ భద్రతకై ఇతర దేశాలపై ఆధారపడలేం

దేశ భద్రతకై ఇతర దేశాలపై ఆధారపడలేం

దేశ భద్రత కోసం ఇతర దేశాలపై మనం ఎక్కువ కాలం ఆధారపడలేమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. మనకు మనంగా రక్షణ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ మనకు కావాల్సిన ఆయుధ సంపత్తిని ఉత్పత్తి చేసుకోవాలని చెబుతూ ఇలాంటి పనులతో దేశీయ స్వావలంబన సాధ్యమవుతుందని తెలిపారు. 

బెంగళూరులోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) లో రెండవ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) ఉత్పత్తి శ్రేణిని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ ఒప్పందం ప్రకారం, తేజస్ ఎల్‌సీఏలను వైమానిక దళానికి అందజేయడం 2024 మార్చి నెలలో ప్రారంభమవుతుంది. 

ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ ఎల్‌ఏసీ తయారీ ప్రారంభోత్సవం మన దేశ స్వావలంబన ప్రతిజ్ఞను మరింత నెరవేరుస్తుందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి రంగంలో స్వయం సమృద్ధిగా ఉండాలని భారత్‌ కోరుకుంటున్నదని, ప్రపంచ దేశాలకు ఇది సందేశాన్ని చేరవేస్తుందని చెప్పారు.

ఇప్పటివరకు సరిహద్దులను రక్షించేందుకు వివిధ దేశాల నుంచి విమానాలు, ఇతరత్రా యుద్ధ సామగ్రిని దిగుమతి చేసుకుంటుండగా.. ఇకపై ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడం అని ప్రకటించారు. సరిహద్దును కాపాడుకుంటూ మన ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు.

ఢిల్లీ నుంచి బెంగళూరు బయళ్దేరే ముందుహెచ్‌ఏఎల్ రెండవ ఎల్‌సీఏ ప్రొడక్షన్ లైన్ ప్రారంభోత్సవానికి బెంగళూరు వెళ్తున్నట్లు ట్విట్టర్‌లో రాశారు. అలాగే, రేపటి నుంచి జరుగనున్న ఏరో ఇండియా ప్రదర్శనకు కూడా హాజరవుతానని ట్వీట్‌లో పేర్కొన్నారు. గత నెలలో జరిగిన దేశ భద్రతపై క్యాబినెట్ కమిటీ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అతిపెద్ద దేశీయ రక్షణ ఒప్పందానికి ఆమోదం తెలిపారు. ఈ ఒప్పందం విలువ రూ.48 వేల కోట్లు. దీని కింద 83 ఎల్‌సీఏ తేజస్ యుద్ధ విమానాలను అభివృద్ధి చేయనున్నారు.

కాగా, గత నెలలో రాజ్‌నాథ్ సింగ్ బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించి దేశీయంగా అభివృద్ధి చేసిన మొదటి డ్రైవర్‌లెస్ మెట్రో కారును ప్రారంభించారు.

ఇలాఉండగా, రేపటి నుంచి బెంగళూరు కేంద్రంగా జరుగనున్న ఏరో ఇండియా ప్రదర్శన రిహార్సల్స్‌ జోరుగా కొనసాగుతున్నది. ఏరో ఇండియా ప్రదర్శనకు రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరుకానున్నారు. ఈ ప్రదర్శనలో అమెరికన్ విమానం బీ 1 లాన్సర్ తో పాటు పలు సంస్థలు పాల్గొంటున్నాయి. ఈ సంవత్సరం వైమానిక ప్రదర్శనలో మా ప్రధాన విమానం బీ 1 లాన్సర్ పాల్గొంటుందని, మొదటిసారి ఇది ఏరో ఇండియాలో పాల్గొంటున్నారని భారతదేశంలో యూఎస్ వ్యవహారాలను పరిశీలిస్తున్న డాన్ హెఫ్లిన్ చెప్పారు.