బిజెపి ఆఫీస్ లపై దాడులు  చేస్తుంటే ఉరుకొం!

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్  త‌మ పార్టీ కార్యకర్తల పై దాడులకు పాల్పడుతోందని బీజేపీ ఎంపీ లు డి అర్వింద్, సాయం బాపురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌మ నాయకులపై, పార్టీ ఆఫీసులపై దాడులు చేస్తే తాము చూస్తూ ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. వ‌రంగ‌ల్ లో బీజేపీ కార్యకర్తలపై దాడిని నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేప‌డ‌తామ‌ని వారు వెల్లడించారు. 
 
టీఆర్‌ఎస్‌ నేతల ప్రోత్బలంతో జరుగుతున్న దాడులు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. రామమందిర నిర్మాణానికి నిధుల సేకరణలో భాగస్వామ్యం పంచుకుంటున్నామని,  రాజకీయ ప్రయోజనాల కోసం కాదని వారు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తన శాసన సభ్యులను కట్టడి చేయాలని  డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాస్తికుడని అంటూ  ముస్లిం, క్రిస్టియన్ గుడులకు పైసలు ఇస్తున్నాడు తప్ప హిందూ దేవాలయాలకు ఎక్కడ ఇవ్వటం లేదని అరవింద్ విమర్శించారు. ఆయన యాగాలు చేస్తాడు, భక్తుడు అంటాడు, తానో పెద్ద హిందువు అంటాడు, మరి శ్రీ రాముడి గుడిపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అస‌లు కేసీఆర్ కి రామమందిరము కట్టడం ఇష్టం ఉందా లేదా చెప్పాలని కోరారు. 
 
బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల పరస్పర దాడులతో ఆదివారం వరంగల్‌ నగరం రణరంగంగా మారింది. పరకాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలతో ఏకంగా దాడులు, ప్రతీకార దాడులకు దిగే వరకు వచ్చింది. 
 
ఆదివారం ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయగా, ఇందుకు ప్రతీకారంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడికి  నిరసనగా బీజేపీ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సుబేదారి పోలీసు స్టేషన్‌ ఎదుట దీక్ష చేపట్టారు.
 
కాగా, రాముడి కార్యంపై రాజకీయాలు చేయవద్దని బీజేపీ నాయకులు రాకేష్ రెడ్డి, పద్మ హన్మకొండ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హితవు చెప్పారు.  దొంగ పుస్తకాలతో విరాళాలు వసూలు చేశామనడంలో వాస్తవం లేదన్నారు. దొంగ పుస్తకాలతో వసూలు చేశామని దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. 
 
బీజేపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని కూడా వారు కోరారు. టీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ కార్యాలయంలో లైట్లు ఆపేసి దాడి చేశారని.. టీఆర్ఎస్‌కు పోలీసులు సహకరించారని బీజేపీ నాయకులు ఆరోపించారు.