సింఘు వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి

దేశ రాజధాని శివారు ప్రాంతాలు సింఘు, టిక్రీ వద్ద శుక్రవారం  తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చట్టాల రద్దుకు నిరసనల్లో ఉన్న రైతులకు, స్థానిక ప్రజలతో కూడిన బృందాలకు మధ్య ఘర్షణ చెలరేగింది. తమ ప్రాంతంలోకి వచ్చి తిష్టవేసుకుని ఇబ్బంది కల్గిస్తున్నారని స్థానికులు సింఘూ వద్దకు గుంపుగా తరలివచ్చారు. రైతులపై రాళ్లు విసిరారు. దీ

నితో రైతుల కూడా ఎదురుదాడికి దిగారు. దీనితో పరిస్థితి శృతి మించుతూ ఉండటంతో పోలీసు బలగాలు తరలివచ్చి భాష్పవాయువు ప్రయోగించారు. లాఠీచార్జికి దిగారు. చాలా సేపటివరకూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు పోలీసులు, నిరసనకారులు గాయపడ్డారు. 

రైతుల ప్రధాన నిరసన ప్రాంతాలుగా నిలిచిన శివార్లు ఇప్పుడు స్థానికులు రైతుల మధ్య కొట్లాటల కేంద్రాలుగా మారడం, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. సింఘూ వద్ద ఘర్షణల సమయంలో ఢిల్లీ పోలీసు అధికారి ప్రదీప్ పలివాల్ గాయపడ్డారు. అక్కడున్న ఓ వ్యక్తి పొడవాటి కత్తితో ఆయనపై దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు.

మరికొందరు కూడా ఇక్కడ గాయపడ్డారు. కత్తితో దాడికి దిగిన వ్యక్తితో పాటు 44 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  తమ నివాసప్రాంతాలకు దగ్గర్లో తిష్టవేసుకుని ఉన్న రైతులు వెంటనే ఖాళీ చేసి పోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.

రైతులు జాతీయ త్రివర్ణ పతాకాన్ని తమ చేష్టలతో అవమానించారని వారికి తగు విధంగా జవాబు చెప్పాల్సి ఉంటుందని విమర్శిస్తున్నారు. ఇక్కడి రైతులపై దాడి జరుగుతున్నదని తెలియగానే సమీపంలోని రైతులు బారికేడ్లు తొలిగించుకుని ఇక్కడికి చేరుకున్నారు. అయితే పరిస్థితి దిగజారకుండా ఉండేందుకు రైతు సంఘాల కార్యకర్తలు వారిని అక్కడి నుంచి వెనకకు పంపించివేశారు.

ఘాజీపూర్ సరిహద్దుల్లోని రైతుల శిబిరాల వద్దకు శుక్రవారం పెద్ద ఎత్తున రైతులు పశ్చిమ యుపి నుంచి వచ్చి చేరారు.  యుపి సరిహద్దుల్లోని ఈ శిబిరాలను ఖాళీ చేయాలని యుపి అధికార యంత్రాంగం ఇప్పటికే హెచ్చరించింది. అయితే వీటిని పట్టించుకోకుండా రైతలు ఇక్కడ దీక్షలు సాగిస్తున్నారు.

వీరికి మద్దతు తెలియచేస్తూ యుపిలోని మీరట్, మొరాదాబాద్, బులంద్‌షెహర్, బిజ్నోర్‌ఇతర ప్రాంతాల రైతలు తెల్లవారుజామునే తరలివచ్చారు.

ఇలా ఉండగా, సామాజిక ఉద్యమనేత అన్నాహజారే కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష సాగించడానికి సిద్ధమైనప్పటికీ తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తన డిమాండ్లు కొన్నిటిని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడమే దీనికి కారణంగా ఆయన వివరించారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాలని తాను డిమాండ్ చేస్తున్నానని, కానీ కేంద్రం ఆమేరకు సరైన నిర్ణయాలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. 

అయితే తన డిమాండ్లు కొన్నిటిని నెరవేరుస్తాని కేంద్రం ఒప్పుకుందని, అలాగే రైతుల బతుకులు బాగుపర్చడానికి వీలుగా కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని అన్నాహజారే చెప్పారు. బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆయనతో భేటీ జరిపి, వివరణ ఇచ్చిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.