కోవిడ్‌ యోధులకు  ఆర్ధిక సర్వే అంకితం 

కోవిడ్‌ యోధులకు  ఆర్ధిక సర్వే అంకితం 

కరోనా  మహమ్మారి నుండి దేశాన్ని రక్షించిన కోవిడ్‌ యోధులకు  ఈ ఏడాది సర్వేను అంకితం చేసినట్టు భారత  ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ ప్రకటించారు. కరోనా వైరస్‌ మహమ్మారి నియంత్రణ, ప్రజల ప్రాణాలను కాపాడంలో ప్రభుత్వం చురుగ్గా, సమర‍్ధవంగా వ్యవహరించిందని ఆయన కొనియాడారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆర్థిక సర్వే 2020-21ని పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనంతం సర్వేని మీడియా సమావేశంలో వివరించారు. ఈ సందర్బంగా కేంద్రం ప్రభుత్వం తీసు​కొచ్చిన బడ్జెట్‌ యాప్‌లో ఆర్థికసర్వే వివరాలను పొందుపర్చినట్టు వెల్లడించారు.

కోవిడ్‌-19 కట్టడికిగాను విధించిన లాక్‌డౌన్‌ తదితర ఆంక్షల కారణంగా దేశంలో 3.7 మిలియన్ల కరోనా కేసులను నివారించగలిగామని పేర్కొన్నారు.  మార్చి 31 తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 7.7 శాతంగా ఉండొచ్చని తెలిపారు. 

అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ వృద్ధి 11 శాతంగా ఉంటుందని సర్వే అంచనా వేసిందన్నారు. కరోనా కట‍్టడిలో, బాధితుల మరణాల నివారణలో  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా ప్రభుత్వాలు సమర్ధవంతంగా వ్యవహరించగా, మహారాష్ట్ర కరోనా కేసులు, మరణాల నివారణలో విఫలమైందని పేర్కొన్నారు.