జూన్‌లో మరో కోవిడ్-19 వ్యాక్సిన్ 

కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భారత దేశం మరో ముందడుగు వేసింది. రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ధైర్యాన్ని నింపుకున్న ప్రజలకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలా మరో శుభవార్త చెప్పారు. జూన్‌లో తాము మరో వ్యాక్సిన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. 

ఈ సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించిన సంగతి తెలిసిందే. పూనావాలా శనివారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, సీరం ఇన్‌స్టిట్యూట్ ఇండియా, నోవావాక్స్ భాగస్వామ్యంలో తయారైన కోవోవాక్స్ ప్రయోగాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఈ ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్‌పై సమగ్రంగా పని చేస్తోందని, అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. భారత దేశంలో ట్రయల్స్ ప్రారంభించేందుకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. కోవోవాక్స్‌ను 2021 జూన్ నాటికి ఆవిష్కరించగలమని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం మన దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ఎమర్జెన్సీ వినియోగానికి ప్రభుత్వం అనుమతించింది. వీటిని జనవరి 16 నుంచి ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఇస్తున్నారు.