క్రిప్టోకరెన్సీ నిషేదిస్తూ బిల్ సిద్ధం 

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న క్రిప్టోకరెన్సీని నిషేధిస్తూ భారత్  ప్రత్యేకంగా ఓ బిల్లును రూపొందించింది.  ‘ది క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ , 2021’పేరుతో రూపొందించిన ఈ బిల్లు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
క్రిప్టోకరెన్సీ స్థానంలో భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకురాబోయే అధికారిక డిజిటల్ కరెన్సీకి సంబంధించిన నియమావళి రూపకల్పనకు ఈ బిల్లు తోడ్పడుతుంది. క్రిప్టోకరెన్సీ సాంకేతిక నేపథ్యం ఆధారంగా దేశంలో రుపీ డిజిటల్ వెర్షన్‌ను తీసుకొచ్చేందుకుగల అవకాశాలను రిజర్వు బ్యాంకు ఇప్పటికే అన్వేషిస్తోంది.
 అయితే, ప్రణాళికాబద్ధమైన ఈ మార్పుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. శుక్రవారం నాటి లోక్‌సభ బులెటిన్‌లోనూ ప్రభుత్వం ఈ బిల్లు గురించి ప్రస్తావించింది. అధికారిక డిజిటిల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు అవసరమైన నియమావళిని రూపొందించేందుకు, దేశంలో ప్రైవేటు క్రిప్టోకరెన్సీని నిషేధించే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకొస్తున్నట్టు తెలిపింది.
దేశంలో క్రిప్టోకరెన్సీని నిషేధించాలనుకోవడం ఇదే తొలిసారి కాదు. బ్యాంకులు, ఈ-వ్యాలెట్ల ద్వారా క్రిప్టోకరెన్సీ లావాదేవీలను ఏప్రిల్ 2018లో రిజర్వు బ్యాంకు నిషేధించింది. తొలుత రిజర్వు బ్యాంకు దీనిని సమర్థించినా, ఆ తర్వాత రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది.
అలాగే, 2019లోనూ ఇలాంటి బిల్లును రూపొందించారు. బిట్‌కాయిన్ సహా క్రిప్టోకరెన్సీని కలిగి ఉన్నా, విక్రయించినా వారికి పదేళ్ల జైలు శిక్ష విధించాలని ప్యానెల్ ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనను ప్రభుత్వం కార్యరూపానికి తీసుకురాలేకపోయింది.