2021-22లో 11 శాతంగా జీడీపీ వృద్ధి రేట్ 

2021-22 ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ వృద్ధి రేటు 11 శాతమని ఆర్థిక సర్వే వెల్లడించింది. నామినల్ జీడీపీ వృద్ధి రేటు 15.4 శాతమని తెలిపింది. ఇక 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో వృద్ధి రేటు -7.7 శాతంగా ఉంటుంద‌ని కూడా చెప్పింది. ఈ ఆర్థిక సర్వే నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం పార్లమెంటుకు సమర్పించారు. అనంతరం లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. ప్రభుత్వ వినియోగం ద్వారా వృద్ధి రికవరీ అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
కంబైన్డ్ ఫిస్కల్ డెఫిసిట్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించిపోతుందని పేర్కొంది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ బ వి-షేప్డ్ రిక‌వ‌రీగా ఉంటుంద‌ని కూడా ఆర్థిక సర్వే అంచ‌నా వేసింది. అయితే క‌రోనా మునుప‌టి జీడీపీ స్థాయిల‌కు చేరుకోవ‌డానికి మ‌రో రెండేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని  సర్వే స్ప‌ష్టం చేసింది. ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌ళ్లీ సాధార‌ణ స్థాయికి చేరుకుంటోంద‌ని, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డంతో సేవ‌లు, వినియోగం, పెట్టుబ‌డుల రంగాలు చాలా వేగంగా పుంజుకుంటాయ‌ని స‌ర్వే తెలిపింది.
గ‌తేడాది కొవిడ్ కార‌ణంగా ఒక్క వ్య‌వ‌సాయ రంగం త‌ప్ప మిగిలిన కాంటాక్ట్ ఆధారిత సేవ‌లు, త‌యారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా న‌ష్ట‌పోయిన‌ట్లు ఈ స‌ర్వే తేల్చింది. ఈ ఏడాది ప్ర‌భుత్వం త‌న 3.5 శాతం ద్ర‌వ్య‌లోటు ల‌క్ష్యాన్ని చేరుకోక‌పోవ‌చ్చ‌ని కూడా ఆర్థిక స‌ర్వే అంచ‌నా వేసింది. గ‌తేడాది -23.9 శాతానికి ప‌త‌న‌మైన వృద్ధి రేటు త‌ర్వాత మెల్ల‌గా కోలుకున్న విష‌యం తెలిసిందే.

 ప్రభుత్వం ప్రకటించిన అంచనాల ప్రకారం భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం క్షీణించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం వ్యయ ప్రణాళికను కొనసాగిస్తుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఓ ప్రైవేట్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మార్చినాటికి ద్రవ్య లోటు జీడీపీలో 7.25 శాతం ఉండవచ్చు, దీనిని 3.4 శాతానికి పరిమితం చేయాలని అంతకుముందు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఉన్న ప్రధాన సవాలు కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయినవారికి ఉపాధి అవకాశాలను సృష్టించడమేనని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుత ఆర్థిక వృద్ధి రేటు రుణాత్మకంగా ఉంది. దీనికి కరోనా లాక్‌డౌన్ కారణమని, దీని వల్ల ఒక్క ఇండియానే కాకుండా అనేక దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని నిర్మలా సీతారామన్  పేర్కొన్నారు. 

వ్యవసాయ రంగంపై కరోనా వైరస్‌ ప్రభావం పడలేదు. అన్ని రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ వ్యవసాయ రంగంలో మాత్రం వృద్ధి నమోదు చేసిందని తెలిపింది. కాంటాక్ట్‌ ఆధారిత సేవలు, తయారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ వినియోగం, నికర ఎగుమతుల క్షీణత ఆర్థికవృద్ధిని బాగాప్రభావితం చేశాయి. 

అయితే ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం రానున్న రెండేళ్ళలో వేగంగా దేశీయ ఆర్థికవ్యవస్థ పుంజుకోనుంది. 17 సంవత్సరాల్లో తొలిసారిగా 2021 ఏడాదిలో జీడీపీలో కరెంట్‌ ఖాతా మిగులు 2 శాతంగా ఉంటుంది.  నిరుపేదలను పేదరికం నుంచి బయట పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికవృద్ధిపై దృష్టి పెట్టాలని కోరింది. 

కరోనా నేపథ్యంలో హెల్త్ కేర్ రంగంపై మరింత దృష్టి కేంద్రీ కరించాల్సి ఉందని  సర్వే  సూచించింది. అలాగే చురుకైన కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీలకు పిలుపు నిచ్చింది. ఆర్థిక సంక్షోభాలను పరిష్కరించే క్రమంలో రాజులకాలంనాటి పురాతన మార్గాలను ఉదాహరించింది. వినియోగాన్ని భారీగా పెంచాలని సాధారణ సంవత్సరాలతో పోలిస్తే మాంద్యం సమయంలో, మెండైన ఉపాధి అవకాశాల కల్పనతోపాటు,  ప్రైవేటు రంగం  ఆర్ధిక సంపదను మెరుగుపర్చడాకి కృషి చేయాలని శుక్రవారం విడుదల చేసిన సర్వే  సిఫారసు చేసింది.