ఇజ్రాయిల్ కార్యాలయం వద్ద భారీ పేలుడు

దేశ రాజధాని ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు జరిగింది. పేలుడు దాటికి మూడు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. గణతంత్ర దినోత్సవ బీటింగ్‌ రిట్రీట్‌కు కిలోమీటర్ దూరంలో ఘటన జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. బీటింగ్ రిట్రీట్ కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న విజ‌య్ చౌక్‌కు పేలుడు ప్రాంతం 1.5 కిలోమీట‌ర్ల దూరం ఉంది. పేలుడు ధాటికి సంఘ‌ట‌నాస్థ‌లంలో మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
 
 ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదని పోలీసులు వెల్లడించారు. పూల‌కుండిలో పేలుడు సంభవించిన‌ట్లుగా అధికారులు తెలిపారు. బీటింగ్ రిట్రీట్‌లో రాష్ట్రపతి, ప్రధాని ఇతర ప్రముఖులు పాల్గొన్న సమయంలోనే ఈ పేలుడు జరిగింది. దీనితో ఈ ప్రాంతంలో విఐపిల భద్రతకు చర్యలు చేపట్టారు. పేలుడుతో అక్కడి వాహనాల అద్దాలు పగిలాయి. కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. 
 
పార్లమెంట్ సెషన్ ఆరంభంరోజున జరిగిన ఈ సంఘటన రాజకీయ వర్గాలలో కూడా ప్రకంపనలకు దారితీసింది. ఢిల్లీ శివార్లలో రైతుల నిరసనలు తీవ్ర ఉద్రిక్తత, ఇటీవలే ఎర్రకోట వద్ద ఘటనల దశలో ఈ పేలుడు ఘటన సంచలనం అయింది. పేదరాయబార కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. ఘటనా స్థలిలో రసాయనికాలతో కూడిన సీసా స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం, ఇంటలిజెన్స్, ఎన్‌ఐఎ, ఫోరెన్సిక్ అధికారులు రంగంలోకి దిగారు. ప్రత్యక్ష సాక్షాధారాలు సేకరించారు.
ఇజ్రాయెల్ ఎంబసీ, కలాం రోడ్‌లో సిసిటీవీ ఫుటేజ్‌లు నిశితంగా పరిశీలిస్తున్నారు. దేశవ్యాప్తంగా సునిశిత ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని ఈ నేపథ్యంలో సిఐఎస్‌ఎఫ్ హెచ్చరికలు వెలువరించింది. ఇక్కడి ఘటనపై హోం మంత్రి అమిత్ షా వెంటనే వివరాలు తెలుసుకున్నారు. ఢిల్లీ పోలీసు కమిషనర్, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో మాట్లాడారు.
 విదేశాంగ మంత్రి జైశంకర్ వెనువెంటనే ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రితో ఫోన్‌లో ముచ్చటించారు. కార్యాలయానికి, సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించినట్లు, సమగ్ర దర్యాప్తు తరువాత బాధ్యులను కఠినంగా శిక్షించనున్నట్లు , ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఇజ్రాయెల్ మంత్రికి తెలిపారు.
పేలుడు దృష్ట్యా సీఐఎస్‌ఎఫ్ దేశవ్యాప్తంగా ‌హెచ్చరికలు జారీ చేసింది. అన్ని ముఖ్య ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పేలుడు సంభవించడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్‌పోర్ట్‌లతో పాటు రైల్వే స్టేషన్లు, ముఖ్య కార్యాయాల్లో భద్రతను పెంచాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించుకుంది.
 
జరిగిన పేలుడుపై ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం స్పందిస్తూ తామంతా సురక్షితంగానే ఉన్నామని, అప్రమత్తతతోనే ఉన్నామని రాయబార అధికారులు పేర్కొన్నారు. పేలుడు నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటూనే ఉన్నామని రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
 
మరోవైపు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు, ఐబీ అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అత్యవసర సమావేశం నిర్వహించారు. 
రాయబార కార్యాలయం వద్ద సంభవించిన పేలుడు గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమిత్‌షాకు వివరించారు. దోవల్ తో పాటు ఐబీ చీఫ్, ఢిల్లీ పోలీసు కమిషనర్ కూడా జరిగిన దానిపై షాకు వివరించారు. 
ఢిల్లీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రెండు రోజుల బెంగాల్‌ పర్యటన రద్దయింది. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలతో పాటు ఇజ్రాయిల్‌ ఎంబసీ వద్ద జరిగిన పేలుడుపై ఘటనను నిశితంగా పరిశీలిస్తున్నారని హోంశాఖ వర్గాలు తెలిపాయి.