కర్ణాటక మండలి డిప్యూటీ చైర్మన్‌ పదవిని బీజేపీ కైవసం

 కర్ణాటక విధాన మండలి డిప్యూటీ చైర్మన్‌ పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. జేడీఎస్ మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి ఈ పదవిని చేజిక్కించుకుంది. శుక్రవారం జరిగిన ఈ ఎన్నిక ఏకపక్షంగా జరిగింది. జేపీ ఎమ్మెల్సీ ఎంకే ప్రణేష్ కర్ణాటక విధాన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కేసీ కొండయ్యపై విజయం సాధించారు.

బీజేపీకి జేడీఎస్ మద్దతివ్వడంతో ప్రణేష్ సునాయాసంగా విజయం సాధించారు. బీజేపీకి 31 ఓట్లు, జేడీఎస్‌కు 13 ఓట్లు ఉన్నాయి. మరొక స్వతంత్ర ఎమ్మెల్సీ కూడా ప్రణేష్‌కు మద్దతిచ్చారు. కాంగ్రెస్‌కు 29 ఓట్లు మాత్రమే ఉన్నాయి. 

డిప్యూటీ చైర్‌పర్సన్ ధర్మే గౌడ ఇటీవల మరణించడంతో ఈ ఎన్నికలు జరిగాయి. జేడీఎస్ నేత ధర్మే గౌడ కాంగ్రెస్ మద్దతుతో ఈ పదవికి గతంలో ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్, జేడీఎస్ మధ్య సంబంధాలు దెబ్బతినడంతో కాంగ్రెస్ శుక్రవారం జరిగిన ఎన్నికలో ఓటమిపాలైంది. 

మరోవైపు విధాన మండలి చైర్మన్ పీసీ షెట్టిని ఆ పదవి నుంచి తొలగించేందుకు బీజేపీ, జేడీఎస్ రంగం సిద్ధం చేశాయి. అవిశ్వాస తీర్మానానికి 14 రోజుల నోటీసును బీజేపీ ఇచ్చింది. ఫిబ్రవరి 2తో ఈ గడువు ముగుస్తుంది. ఈ పదవిని జేడీఎస్ నేతకు ఇచ్చేందుకు ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.