ఆఫ్రికాకు భారత్‌ కోటి డోసుల వ్యాక్సిన్‌

కరోనా మహమ్మారితో అల్లాడుతున్న ఆఫ్రికాకు భారత్‌ ఆపన్న హస్తం అందించింది. ఇప్పటికే పలు దేశాలకు వ్యాక్సిన్‌ను బహుమతి ఇచ్చిన భారత్‌ దేశంలో తయారైన కోటి డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేసింది. 

అలాగే మరో పది లక్షల డోసులను ఐక్యరాజ్య సమితి ఆరోగ్య కార్యకర్తలకు అందించింది. గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్‌ అండ్‌ ఇమ్యునైజేషన్‌ కింద వ్యాక్సిన్‌ను పంపుతోంది. ఇదిలా ఉండగా  గల్ఫ్‌ దేశం ఒమన్‌కు లక్ష, కరేబియన్‌ దేశాలకు ఐదు లక్షలు, నికరాగ్వా రెండు లక్షలు, పసిఫిక్‌ ద్వీప దేశాలకు రెండు లక్షల డోసుల వ్యాక్సిన్‌ బహుమతిగా ఇవ్వనున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

 ఈ సందర్భంగా విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కొవిడ్‌పై పోరాటంలో భారతదేశం అంతర్జాతీయ సహకారాన్ని తన విధిగా భావిస్తుందన్నారు. ఈ మేరకు ప్రధాని చేసిన ప్రకటన అనుగుణంగా మొదట పొరుగు దేశాలకు మొదట ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం మిగతా దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటి వరకు భారత్‌ పొరుగున ఉన్న తొమ్మిది దేశాలకు 55లక్షల డోసులను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇందులో భూటాన్‌కు 1.5లక్షలు, మాల్దీవులకు లక్ష, నేపాల్‌కు 10 లక్షలు, బంగ్లాదేశ్‌కు 20 లక్షలు, మయన్మార్ 15 లక్షలు, మారిషస్ లక్ష, సీషెల్స్ దేశాలకు 50వేలు శ్రీలంకకు ఐదు లక్షలు, బహ్రెయిన్‌కు లక్ష డోసులు ఇచ్చింది.

వాణిజ్యపరంగా బ్రెజిల్‌, మొరాకో, బంగ్లాకు వ్యాక్సిన్లను ఎగుమతి అయ్యాయి. త్వరలోనే సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, కెనడా, మంగోలియాకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయనుంది. భారత్ తయారు అందించిన వ్యాక్సిన్‌తో నేపాల్, బంగ్లాదేశ్ బుధవారం తమ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి