వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిమితికి మించి భారీ స్థాయిలో సలహాదారులను నియమించారని చెబుతూ ఎవరైనా కోర్ట్ కు వెడితే వారందరి ఉద్యోగాలు ఖాళీ అవుతాయని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. తెలంగాణలో ఆ విధంగా కోర్ట్ తీర్పు ఇవ్వడంతో పలువురు సలహాదారులు ఉద్యోగాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు.
అయితే సలహాదారులు ఎవ్వరు ముఖ్యమంత్రికి అవసరమైన సలహాలు ఇవ్వడం లేదని, పరిపాలనను గాడి తప్పిస్తున్నారని ఆయన విమర్శించారు. అందుకనే ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాలలో పదే పదే అభాసుపాలవుతున్నదని, పైగా పరిపాలనను కుంటుపరుస్తున్నారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి తన సలహాదారుల ప్రయోజనం గురించి ఒక సారి పునరాలోచించు కోవాలని ఆయన హితవు చెప్పరు.
ఇలా ఉండగా, ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదా కలిగి ప్రతినెలా ప్రజాధనాన్ని జీతభత్యాల కింద తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వోద్యోగి కిందకే వస్తారని, రాజ్యాంగ వ్యవస్థను కించపరచేలా ఆయన ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగతంగా దూషణలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల నిర్వహణపై విస్పష్టమైన తీర్పు వెలువడ్డాక కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శలు చేస్తుంటే..అసలు ఆయనెవరన్న ఆసక్తి రాష్ట్రమంతా నెలకొంది. నేను కూడా ఆయనెవరో తెలుసుకునే ప్రయత్నం చేశాను” అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆయన వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. సీఎం జగన్ సొంత పత్రికలో ఎడిటోరియల్ బోర్డు సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారని తెలిసినదని చెబుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక చాలామంది సలహాదారుల్లో ఒకరిగా సజ్జల నియమితులయ్యారని పేర్కొన్నారు.
ఇప్పుడు ఆయన కీలకమైన ప్రజా సంబంధాలు-ప్రజా వ్యవహారాల పోస్టులోఉంటూ కేబినెట్ హోదా అనుభవిస్తున్నారని, ఆయనకు సెక్రటేరియేట్‌లో గదిని కేటాయించారని వివరించారు. కేబినెట్ హోదాలో జీతభత్యాలు తీసుకుంటున్నందున ప్రస్తుతం ఆయన ప్రభుత్వోద్యోగి కిందే లెక్క అని స్పష్టం చేశారు. ‘పనికిమాలిన వారినందరినీ సలహాదారులుగా నియమించుకోవడమేంటి? వాళ్లకు కేబినెట్ ర్యాంకులు ఇవ్వడమేంటి? ఎవరైనా హైకోర్టును ఆశ్రయిస్తే సజ్జలకు ఇచ్చిన హోదా తొలగిపోతుంది’’ అని ఎద్దేవా చేశారు.
More Stories
చైనాలో ఏపీ, తమిళనాడు ఎంబిబిఎస్ విద్యార్థులకు జైలు శిక్ష
తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని
ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం అందిస్తాం