మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుకు రామతీర్థాలు అనువంశిక ధర్మకర్తగా తొలగిస్తూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులని రాష్ట్ర హై కోర్ట్ కొట్టివేసింది. కోర్టు తీర్పు అనంతరం అశోక్‌గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ మరోసారి రాముడికి సేవ చేసే భాగ్యం కలిగిందని భావిస్తున్నానని ప్రకటించారు.
మూడు ప్రముఖ దేవస్థానాల ధర్మకర్త హోదా నుంచి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. రామతీర్థం రామాలయం, విజయనగరం పైడితల్లి, మందపల్లి ఆలయాల ధర్మకర్త హోదా నుంచి అశోక్ గజపతిరాజును ఇటీవల ప్రభుత్వం తొలగించింది. ఆయనకు ఈ హోదా రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన జీవో 65ను ఉపసంహరిస్తూ దేవదాయశాఖ మెమో ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై అశోక్‌గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు.
ఇప్పటికే అశోక్ గజపతిరాజును ప్రతిష్ఠాత్మక సింహాచల దేవస్థానం చైర్మన్ పదవి నుంచి జగన్ సర్కార్ తొలగించింది. అలాగే విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్(మాన్సాస్) ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించింది.
ఈ రెండు పదవుల్లో ఆయన అన్న, మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును ప్రభుత్వం నియమించింది. మాన్సాస్ ట్రస్టు పరిధిలో 108 దేవాలయాలు, వివిధ రాష్ట్రాల్లో, జిల్లాల్లో వేల కోట్ల విలువ చేసే 14,800 ఎకరాల భూములు ఉన్నాయి.
ఈ ట్రస్టు దేవదాయ ధర్మాదాయ శాఖ (ఎండోమెంట్) శాఖ పరిధిలో ఉంది. 1879కి పూర్వమే విజయనగరం రాజుల ఆధ్వర్యంలో విద్యాలయాలు వెలిశాయి. ప్రాథమిక పాఠశాలల నుంచి పీజీ వరకు, సాంకేతిక విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. మాన్సాస్ ఏర్పాటైన తర్వాత ట్రస్టు పరిధిలోకి వెళ్లాయి. భూముల నుంచి వచ్చిన ఆదాయాన్ని వాటి నిర్వహణకు వినియోగిస్తున్నారు. మాన్సాస్ ట్రస్టు డీడ్ ప్రకారం రాజవంశంలో పెద్దవాడైన పురుష వారసుడు ట్రస్టు వారసత్వ చైర్మన్‌గా ఉండాలి. ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా జీవో ఇచ్చింది.
More Stories
విశాఖ ఉక్కు కాపాడుకుందాం
22న కృష్ణాతీరంలో 5వేల డ్రోన్ల ప్రదర్శన
రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు