చిత్తూరు జిల్లాలో ఓ స్వామిజీ దారుణహత్య

చిత్తూరు జిల్లాలో ఓ స్వామిజీ దారుణహత్యకు గురయ్యారు. ఐరాల మండలం గుండ్లపల్లె సమీపంలోని శ్రీరామతీర్థ సేవాశ్రమంలో అచ్యుతానందగిరి స్వామిని గుర్తు తెలియని ఆగంతకుడు హత్య చేశాడు. ఆశ్రమవాసి లక్ష్మమ్మ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం శ్రీరామతీర్థ సేవాశ్రమ బాధ్యతలను అచ్యుతానందగిరి స్వామి పర్యవేక్షిస్తున్నారు. లక్ష్మమ్మ అనే వృద్ధురాలైన సహాయకురాలితో కలిసి ఆశ్రమంలో ఇద్దరే ఉంటున్నారు. 
 
మంగళవారం రాత్రి భోజనాలయ్యాక 8.30 గంటల సమయంలో ఓ ఆగంతకుడు ఆశ్రమంలోకి చొరబడి అచ్యుతానందగిరి స్వామిపై దాడి చేశాడు. ఆ చప్పుడు విని అక్కడకు వచ్చిన లక్ష్మమ్మ భయంతో పారిపోయి మామిడి తోటలో దాక్కుని రాత్రంతా అక్కడే ఉండిపోయింది. 
 
బుధవారం ఉదయం వచ్చి చూసేసరికి అచ్యుతానందగిరి స్వామి చనిపోయి ఉన్నారు. ఈ ఘటనపై అచ్యుతానందగిరి స్వామి అన్న శ్రీరాములు రెడ్డి మాట్లాడుతూ.. తన తమ్ముడు ఇటీవల పూతలపట్టు మండలం మిట్టూరు వద్ద ఓ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసినట్లు, విక్రయించిన వ్యక్తి ఇప్పటివరకు దానిని అప్పగించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు.
 
అతడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఆశ్రమానికి చెందిన రెండు సెల్‌ ఫోన్లను ఆగంతకుడు తీసుకెళ్లినట్లు తెలిసింది. సంఘటనా స్థలంలో పోలీసులకు ఓ పర్సు, మొబైల్‌ లభించిందని సమాచారం. 
 
డాగ్‌ స్క్వాడ్‌ ఆశ్రమం నుంచి కొద్ది దూరంలోని పెట్రోల్‌ బంక్‌ వరకు వెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనపై డీఎస్పీ సుధాకరరెడ్డి మాట్లాడుతూ.. ఆగంతకుడు తీసుకెళ్లిన మొబైల్‌ ఫోన్‌ కల్లూరు పరిసరాల్లో స్విచ్ఛాఫ్‌ అయిందని తెలిపారు.