రామమందిరంకు సుజనాచౌదరి 2.2 కోట్లు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బిజెపి రాజ్యసభసభ్యుడు సుజనాచౌదరి తన తండ్రి యలమంచిలి జనార్దనరావు పేరిట కుటుంబం తరఫున రూ.2,2,32,000 విరాళం ప్రకటించారు. రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణలో భాగంగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం ఏపీలోని విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ విరాళాన్ని ప్రకటించారు.
 
ఈ సందర్భంగా సుజనా ప్రసంగిస్తూ రామ మందిర నిర్మాణంలో భాగస్వాములవటం గర్వకారణంగా చెప్పారు. శ్రీరాముడిలా విలువలకు కట్టుబడి కష్టపడితే జీవితంలో మంచి స్థాయికి ఎదగవచ్చని పేర్కొన్నారు.  బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్‌ రూ.5,00,116 ప్రటించారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ రూ.5 లక్షలు, సీసీఎల్‌ గ్రూప్‌ రూ.6.39 లక్షలు, సిద్ధార్థ అకాడమీ తరఫున రూ.15 లక్షలు విరాళం ప్రకటించారు.
ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ.30 లక్షల విరాళం అందజేశారు. ఇటీవల మైహోమ్ గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు రూ. 5 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి రూ. 6 కోట్లు ఇచ్చారు. అపర్ణ కన్స్స్ట్రక్షన్స్ రూ. 2 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ కోటి రూపాయలు విరాళం ఇచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు కూడా విరాళాలు ఇచ్చారు. 
 
 కాగా, అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా విరాళాలు సేకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం శ్రీ అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రూ.10, రూ.100, రూ.1000 కూపన్లను ముద్రించింది. రూ.2 వేలు, ఆ పైన ఇచ్చే విరాళాలకు రశీదులు కూడా ఇస్తున్నారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు నిధుల సమీకరణ కొనసాగుతుందని ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ నేతలు తెలిపారు.