పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్ట్ గ్రీన్ సిగ్నల్ 

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీంకోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకారం యతావిధిగా ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్‌ జరుగుతున్న కారణంగా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్ట్‌ కొట్టివేసింది. 
 
ముఖ్యంగా ఉద్యోగ సంఘాల తీరుపై సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. పంచాయితీ ఎన్నికలు అనేవి రాజ్యాంగబద్ద ప్రక్రియ అని, అందులో ఉద్యోగసంఘాలకు ఏం సంబంధమని ప్రశ్నించింది.  జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించమని ధర్మాసనం తేల్చి చెప్పింది.  
 
 ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదని, రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో మీకేం సంబంధమని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా అన్న ధర్మాసనం.. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని స్పష్టం చేసింది. 
 
కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలని కోరిన విషయాన్ని జస్టిస్ కౌల్ ప్రస్తావించారు. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఎస్‌ఈసీ సమావేశానికి ఉద్యోగ సంఘాలు ఎందుకు హాజరు కాలేదని జస్టిస్ కౌల్‌ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఉద్యోగ సంఘాల స్వరం మారింది.  తాము ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఎప్పుడూ చెప్పలేదని ఇప్పుడు మాట మార్చారు. 
 
పంచాయతీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ పిటిషన్‌కు ముందే ఎస్ఈసీ కేవియట్‌ దాఖలు చేసింది. విచారణలో తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.     
 తాజాగా కేంద్రహోంశాఖ కార్యదర్శికి ఎస్‌ఈసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లేఖ రాశారు. ఎన్నికలకు సహకరించబోమని కొన్ని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని, కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని కోరారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో కేంద్ర సిబ్బందిని ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.
కాగా,  ఏపీలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్‌ స్వల్పంగా మారింది. పంచాయతీ ఎన్నికలు వద్దంటూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు ఆలస్యం అయింది. దీంతో మొదటి విడత ఎన్నికలను నాలుగో విడతగా మార్చి అందుకు కొత్త తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
మార్చి 21న నాలుగో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇక రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నికలను ఒకటి, రెండు, మూడు విడతలుగా మార్చి వాటిని యథాతథంగా జరపనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. మారిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 7న, రెండో విడత ఫిబ్రవరి 13న, మూడో విడత ఫిబ్రవరి 17, నాలుగో విడత ఫిబ్రవరి 21న జరగనున్నాయి.