32 మంది చిన్నారుల‌కు రాష్ట్రీయ బాల పుర‌స్కారాలు 

విభిన్న రంగాల్లో అసాధార‌ణ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన 32 మంది చిన్నారుల‌కు ఇవాళ ప్ర‌ధాన‌మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కారాల‌ను అంద‌జేశారు. ఇన్నోవేష‌న్‌, క్రీడ‌లు, క‌ళ, సంస్కృతి, స‌మాజ‌సేవ‌, ధైర్యాసాహ‌సాలు వంటి రంగాల్లో అస‌మాన తెగువ‌ను ప్ర‌ద‌ర్శించిన చిన్నారుల‌కు ఈ అవార్డులు ఇచ్చారు.  

పుర‌స్కారాలు గెలిచిన విద్యార్థుల‌తో ప్ర‌ధాని నరేంద్ర  మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు.  ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మ‌హిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతీఇరానీ పాల్గొన్నారు. 

ఈ యేడాది బాల పుర‌స్కారాలు విశిష్ట‌మైన‌వ‌ని, ఎందుకంటే ఆ అవార్డుల‌ను క‌రోనా క‌ష్ట‌కాలంలో గెలుచుకున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.  స్వ‌చ్ఛ‌భార‌త్ లాంటి ఉద్య‌మంలో చిన్నారులు కీల‌క పాత్ర పోషించిన‌ట్లు తెలిపారు. కరోనా వేళ హ్యాండ్‌వాష్ లాంటి ప్ర‌చారంతో ప్ర‌జ‌ల్ని అల‌ర్ట్ చేసిన‌ట్లు తెలిపారు.  

చిన్న ఐడియాకు స‌రైన స‌మ‌యంలో స‌హ‌కారం ల‌భిస్తే, అప్పుడు ఫ‌లితం అద్భుతంగా ఉంటుంద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. చిన్నారులు త‌మ కార్యాచ‌ర‌ణ‌తో ప‌నులు మొద‌లుపెట్టాల‌ని, అది ఇత‌రుల‌కు ప్రేర‌ణ ఇస్తుందని కొనియాడారు.  పుర‌స్కారాలతో సంతృప్తి ప‌డ‌కుండా.. ఉత్త‌మ ఫ‌లితాల కోసం మ‌రింత క‌ష్ట‌ప‌డాల‌ని సూచించారు. పిల్ల‌లు మూడు వాగ్దానాలు చేయాల‌ని, ఒక‌టి నిల‌క‌డ‌గా ఉండాల‌ని, రెండు దేశం కోసం ప‌నిచేయాల‌ని, మూడ‌వ‌ది వినయంగా ఉండాల‌ని చెప్పారు.