రామ మందిరంకు పవన్ కల్యాణ్ రూ 30 లక్షల విరాళం

 
 అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ. 30 లక్షలను విరాళంగా ప్రకటించారు. సంబంధిత చెక్కును ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారం భరత్‌జీకి తిరుపతిలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ధర్మానికి ప్రతిరూపమే శ్రీరామచంద్రుడు. సహనం, శాంతి, త్యాగం, శౌర్యం.. ఈ దేశం ఎలాంటి దాడులు, ఒడిదుడుగులు ఎదురైనా మన దేశం బలంగా నిలబడగలిగింది అంటే శ్రీరాముడు చూపిన మార్గమే’  అని స్పష్టం చేశారు. 
 
పరమత సహనం మనదేశంలో ఉందంటే అది ఆయన చూపిన దారే అని, అందుకే రామరాజ్యం అన్నారని తెలిపారు. అన్ని మతాల వారు, ప్రాణకోటి సుఖంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామాలయం కడుతుంటే భారతీయులంతా, పిల్లాపాపలంతా విరాళాలు ఇస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. 
 
ఆయ‌న‌ వ్యక్తిగత సిబ్బంది కూడా రూ.11వేలు ఇచ్చారు. కులాలకు, మతాలకు అతీతంగా రామ మందిర నిర్మాణానికి తన సిబ్బంది ముందుకు రావడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని పవన్ చెప్పారు.  కాగా, టిడిపితో జనసేన, బిజెపి కలిసే పరిస్థితి లేదని  పవన్‌కల్యాణ్‌ తేల్చిచెప్పారు. రాష్ట్రంలో బిజెపి, జనసేన కలయికే ప్రత్యామ్నాయమని, ఈ అవకాశాన్ని బిజెపి వదులుకోకూడదని సూచించారు. 
 
గత ఎన్నికలలో ఉపాధి కల్పిస్తారనే నమ్మకంతో తనపై అభిమానం ఉన్న వారు కూడా వైసిపికి ఓటు వేశారని పేర్కొన్నారు.  అయితే నేడు ప్రభుత్వ చర్యలతో వారంతో నిరుత్సాహంతో ఉన్నారని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల పుట్టినరోజు వేడుకలకు బార్లు తెరిచినప్పుడు రాని కరోనా సమస్య స్థానిక ఎన్నికలకు ఎందుకు అడ్డు వచ్చిందని ఎద్దేవా చేశారు. 
 
రాష్ట్రంలో 141 సెక్షన్‌, 30 యాక్ట్‌ను ఇష్టారాజ్యంగా అమలు చేస్తూ జగన్‌ అరాచక పాలన చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన కార్యకర్తలపై దాడులు ఆపకపోతే తామూ సహనం కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ముక్కంటి ఏకాశి అంటే ఒక్క రోజే ఉంటుందని, టిటిడి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని దయ్యబట్టారు. ఆలయాల్లో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి జనసేన ఆధ్వర్యంలో ‘షాడో’ కమిటీని వేయనున్నట్లు చెప్పారు.
కాగా, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. విశ్వహిందూ పరిషత్‌ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మిలింద్‌ పరాందేతో పాటు ఆరెస్సెస్‌ ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా తాడేపల్లిలో సుబ్బారెడ్డిని కలిశారు. రామమందిర నిర్మాణానికి టీటీడీ తరఫున సహాయం అందించాలని కోరారు. దీనిపై బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుబ్బారెడ్డి తెలిపారు.