‘పరాక్రమ దివాస్’ … నేతాజీకి నిజమైన నివాళి!   

‘పరాక్రమ దివాస్’ … నేతాజీకి నిజమైన నివాళి!   

డా. టి ఇంద్రసేనారెడ్డి

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా ఆయన జయంతి (జనవరి 23)ని ‘పరాక్రమ దినోత్సవం’గా నిర్వహించాలని భారత  ప్రభుత్వం నిర్ణయించడం గత 70 ఏళ్లుగా స్వతంత్ర భారత్ లో తగు గౌరవం పొందలేకపోతున్న భారత మాత గర్వించే ముద్దుబిడ్డలలో ఒకరైన ఆ మహాయోధుడికి నిజమైన నివాళిగా భావించవచ్చు.  
 
భారత దేశం సుమారు వేయేళ్ల విదేశ పాలకుల పాలన నుండి విముక్తి చెంది, స్వతంత్ర పాలన ఏర్పర్చుకోవడంలో నిర్ణయాత్మక పాత్ర వహించిన యోధుడు నేతాజీగా చెప్పవచ్చు. కేవలం భారత దేశం స్వతంత్రం పొందడానికే కాకుండా ఆసియా- పసిఫిక్ ఖండంలో సుమారు 60 దేశాల స్వాతంత్రానికి ఆయన స్ఫూర్తి కలిగించారు.
విదేశీ గడ్డపై జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని, బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టడం కోసం ఆయన జరిపిన వీరోచిత పోరాటమే ఆంగ్లేయులకు వణుకు పుట్టించింది. వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధంలో తమ సంకీర్ణ సేనలు విజయం సాధించిన విజయగర్వంతో ఉన్న ఆంగ్లేయులు అకస్మాత్తుగా భారత్ ను వదిలి వెళ్లాలనుకోవడం అప్పట్లో చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.
ఎందుకంటె 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమాన్ని మూడు నెలల కాలంలోనే బ్రిటిష్ పాలకులు అణచివేశారు. ఆ తర్వాత చెప్పుకోదగిన ప్రతిఘటన వారి పరిపాలనకు దేశంలో ఎదురు కాలేదు. కేవలం నేతాజీ ఉనికి భయంతో,  సైనిక తిరుగుబాటు జరిగితే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆర్ధిక వ్యవస్థ చితికిపోయి ఉండడంతో తట్టుకోలేమనే ఖంగారులో దేశాన్ని రెండుగా కృత్రిమంగా విభజించి, వెళ్లిపోయారు. 
 
మొత్తం ప్రపంచ చరిత్రలో ఎటువంటి చారిత్రక, సాంస్కృతిక, నాగరిక నేపధ్యం లేకుండా కేవలం మతం ఆధారంగా ఒక దేశం ఏర్పాటు జరగడం పాకిస్థాన్ పేరుతో బ్రిటిష్ వారు జరిపిన కుట్రలో భాగంగా చెప్పుకోవచ్చు. పాకిస్థాన్ విభజన కుత్రిమంగా, కుట్రపూరితంగా ఏర్పడినది అనడానికి కేవలం 24 ఏళ్లలో ఆ దేశంలో సగంకుపైగా భూభాగం బాంగ్లాదేశ్ పేరుతొ స్వతంత్ర దేశంగా 1971లో విడిపోవడమే చెబుతుంది.  
నేతాజీ ఏర్పర్చిన ఆజాద్  హిందూ ఫోజ్ సైన్యంలో సుమారు మూడు లక్షల మంది వరకు ఉన్నారు. వారిని బ్రిటిష్ వారు చెల్లాచెదురు కావించినా, వారి తిరిగి ఒకటై తిరగబడితే …. అనే భయం వారిని వెంటాడింది. మరోవంక రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు ఎక్కడ విజయం సాధించినా వారి తరపున పోరాడిన భారతీయ సైనికుల వీరోచిత పోరాటమే దోహదపడింది. 
పట్టుబడిన నేతాజీ సైనికులపై రెడ్ ఫోర్ట్ వద్ద సైనిక విచారణ జరుపుతూ ఉంటె బ్రిటిష్ వారి భారతీయ నావికాదళంలో తిరుగుబాటు ఐదురోజుల పాటు జరిగింది. దానితో భయపడ్డారు. నేతాజీ సైన్యం, భారతీయ సైన్యం 1857లో వలే కలసి ఉమ్మడిగా తిరుగుబాటు జరిపితే భారీ మూల్యం చెల్లింపవలసి వస్తుందని ఖంగారు పడ్డారు.
ఈ విషయాన్నీ స్వయంగా ఆ సమయంలో బ్రిటిష్ ప్రధాన మంత్రిగా ఉన్న క్లెమెంట్ అట్లే ఆ తర్వాత తన భారత పర్యటన సందర్భంగా  చెప్పారని  సైనిక చరిత్రకారుడు  జనరల్ జీడీ బక్షి తన గ్రంధంలో వెల్లడించారు. మహాత్మా గాంధీ, నాటి కాంగ్రెస్ నాయకత్వం జరిపిన శాంతియుత ఉద్యమం కన్నా నేతాజీ సైన్యం భారత దేశంపై స్వాతంత్య్రం రావడంలో కీలక భూమిక వహించినట్లు అట్లీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అయన 1956లో భారత దేశ పర్యటన సందర్భంగా కొలకత్తాలో  బెంగాల్ గవర్నర్ అతిధిగా బస చేసిన సమయంలో ఈ వివరాలు చెప్పారు.
ఆ సమయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిబి చక్రవర్తి గవర్నర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన సుదీర్ఘంగా అట్లీతో జరిపిన తన సంభాషణలను ప్రముఖ చరిత్రకారుడు ఆర్ సి మజుందార్ కు వ్రాతపూర్వకంగా తెలిపారు. 
 
” గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడో చల్లారిపోయింది. 1947లో మీపై పెద్దగా వత్తిడి కూడా లేదు. అయినా ఎందుకని భారత్ ను వదిలి వెళ్లిపోయారు?”  అంటూ చక్రవర్తి నేరుగా ప్రశ్నించారు. భారత దేశానికి స్వతంత్రం ఇస్తూ అధికారిక పత్రంపై సంతకం చేసింది అట్లీ కావడం గమనార్హం. 
 
“అట్లీ అనేక కారణాలు చెబుతూ ప్రధానంగా నేతాజీ సైన్యం కారణంగా బ్రిటిష్ భారత సైన్యంలో బ్రిటిష్ రాణి పట్ల అంకితభావం తగ్గిపోతూ రావడంతో వెళ్లిపోవలసి వచ్చింది అంటూ స్పష్టం చేసారు. గాంధీ ప్రభావం గురించి అడిగితే వ్యంగ్యంగా నవ్వుతూ `చాలా పరిమితం’ అని చెప్పారు”  అంటూ చక్రవర్తి ఆ నాటి సంభాషణలను నెమరువేసుకున్నారు. 
 
2007లో భారత్ కు అధికార పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని షింజో అబే ఇతర దేశాధినేతల వలె ఢిల్లీలో గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించకుండా కోలకత్తాకు వచ్చి, నేతాజీ కుటుంభం సభ్యులతో కొంత సమయం గడిపారు. భారత దేశంతో పాటు అనేక ఆసియా, పసిఫిక్ దేశాలు స్వతంత్రం పొందడంలో నేతాజీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన తాతగారు రెండో యుద్ధ ప్రపంచ సమయంలో జపాన్ లో ఎంపీగా ఉంటూ నేతాజీతో కలసి పనిచేశారు. 
 
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పటి నుండి నేతాజీ పట్ల అత్యున్నత గౌరవం చూపుతూ వాస్తున్నారు. బహుశా నేతాజీ కుటుంభం సభ్యులు, బంధువులు 35 మందిని అక్టోబర్, 2015లో ఢిల్లీలోని తన అధికార నివాసంకు ఆహ్వానించి, వారితో కొంచెం సేపు గడిపారు. 
 
వారి కోర్కెపైననే జనవరి, 2016 నుండి వరుసగా నేతాజీకి సంబంధించిన రహస్యం అంటూ ప్రభుత్వం వద్ద గోప్యంగా ఉంచుతూ వస్తున్న వందలాది ఫైళ్లను బహిర్గతం చేయడం ప్రారంభించారు. “నన్ను కూడా మీ కుటుంభం సభ్యులలో ఒకనిగా భావించండి” అంటూ వారితో ప్రధాని చెప్పారు.
స్వతంత్రం రావడానికి నాలుగేళ్లు ముందుగానే 1943 అక్టోబర్ 21న భారత దేశపు మొదటి స్వతంత్ర ప్రభుత్వం – ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని నేతాజీ ప్రకటించారు. ఆ చారిత్రాత్మకమైన రోజు 75వ వార్షికోత్సవం సందర్భంగా 2018లో ప్రతి ఏటా నేతాజీ జయంతి జనవరి 23న విపత్తి యాజమాన్యంలో విశేషంగా కృషిచేసిన వారికి/సంస్థకు ఒక జాతీయ అవార్డు ఇవ్వనున్నట్లు ప్రదాని మోదీ ప్రకటించారు.
 
చాల పరిమితమైన వనరులతో, ఆపదలను సహితం లెక్క చేయకుండా యుద్ధవాతావరణంలో సుదూర ప్రయాణాలు జరిపి జపాన్, జర్మనీ వంటి దేశాల మద్దతును `శత్రువు శత్రువు మిత్రుడు’ అనే వ్యూహాత్మక నానుడితో సంపాదించి, జాతీయ సైన్యమును తయారు చేయడం బహుశా ప్రపంచ చరిత్రలో అటువంటి సాహసాలను మరెవ్వరు చేసి ఉండరు. 
 
అంతటి గొప్ప యోధుడికి చివరకు ఆయన జయంతిని `పరాక్రమ దివస్’ గా జరుపుకొంటూ గుర్తు చేసుకోవడం యువతరంకు స్ఫూర్తిదాయకం కాగలదు. బ్రిటిష్ వారితో బేరసారాలు ఆది కాకుండా, పోరాడి స్వతంత్రం సాధించుకోవడం పట్ల ఆయన చూపిన అసామాన్యమైన ధైర్యసాహసాలు ఆనాటి దేశ యువతను ఉద్రేకంలో నింపివేశాయి.
 బ్రిటిష్ నిఘాలో కూడా ఆయన దేశం వదిలి వెళ్ళిపోయిన విధానం సైనిక నిపుణులను సహితం ఆశ్చర్య పరచింది. ఆ మహాయోధుడి 125వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విభాగాలు అన్ని సంవత్సరం పొడువునా దేశ, విదేశాలలో విశేషమైన కార్యక్రమాలు చేపట్టడం ముదావహం.
 
125వ జయంతి కార్యక్రమాలు జరపడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలను ప్రధాని స్వయంగా కొలకత్తాలో ప్రారంభిస్తున్నారు. ఆ రోజున నేతాజీ జన్మించిన ఓడిశాలోని కటక్ లో కూడా ప్రత్యేక కార్యక్రమం జరుపుతున్నారు. ఈ ఏడాది జాతీయ స్థాయిలో కబడితో సహా భారతీయ క్రీడల పోటీలు జరుపుతున్నారు. 
 
ఐదు విశ్వవిద్యాలయాలలో నేతాజీ పీఠాలను ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని విమానాలపై నేతాజీ చిత్రాలను ముద్రిస్తుండగా, ఒక రైలుకు నేతాజీ పేరు పెట్టనున్నారు. నేతాజీని పెద్ద  ఎత్తున స్మరించుకొనేటట్లు చేస్తున్న ప్రయత్నాలు భారతీయ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలబడగలవు.