కేటీఆర్ ను సీఎం చేస్తే అణు బాంబు పేలడం పక్కా

కేటీఆర్‌ను సీఎం చేస్తే టీఆర్‌ఎ్‌సలో అణు బాంబు పేలడం పక్కా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా పని చేయడం చేతగాకపోతే ఎన్నికలకు సిద్ధం కావాలని  సవాల్‌ విసిరారు. ఎవరిని సీఎం చేయాలన్నది ప్రజలే తేలుస్తారని స్పష్టం చేశారు. ‘‘సీఎంగా ఎవరిని చేయాలన్నది టీఆర్‌ఎస్‌ అంతర్గత వ్యవహారమే కావొచ్చు.. కానీ, మిమ్మల్ని సీఎంగా గుర్తించే మీ పార్టీని ప్రజలు గెలిపించిండ్రు.. ఇప్పుడు కేటీఆర్‌ను సీఎం చేస్తామంటే ప్రజలు ఒప్పుకొంటారా? మీకు చేతకానిది మీ కొడుక్కి చేతనవుతద్దా?’’ అని ప్రశ్నించారు. 

తెలంగాణ ఏర్పాటయ్యాక దళితుడిని సీఎం చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదు? అని నిలదీశారు. మంత్రులుగా ఉన్న కొంతమంది ఉద్యమకారుల్లో లేనిదేంది? కేటీఆర్‌లో ఉన్నదేంది? కేటీఆర్‌ను సీఎం చేయడాన్ని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఒప్పుకోవడం లేదు. మంత్రివర్గ విస్తరణ జరగనీయండి.. ఏం జరుగుతుందో చూడండి’’ అని ఎద్దేవా చేశారు. 

కేటీఆర్‌ను సీఎం చేయడానికి దోష నివారణ పూజలు చేసి, ఆ సామగ్రిని త్రివేణి సంగమంలో కలిపేందుకు కాళేశ్వరం వెళ్లిన కేసీఆర్‌.. ఎలా నటిస్తూ.. ఎలా జీవించారో అందరూ చూశారని అన్నారు. కేసీఆర్‌ ఓ జోకర్‌లా మారారని, ఆయనతో 24 గంటల్లో సినిమా తీయొచ్చని, ప్రేక్షకులు కూడా ఎక్కువ వస్తారని ఎద్దేవా చేశారు. 

తెలంగాణకు కేసీఆరే పెద్ద దోషం.. ఆయన్ను సీఎం చేసినందుకు రాష్ట్ర ప్రజలు దోషనివారణ పూజలు చేయాలని చెప్పారు. తెలంగాణలోనూ అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలుకు ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఆర్యవైశ్య, బ్రాహ్మణ, వెలమ, రెడ్డి జాగృతి, మహిళా సంఘాలకు చెందిన నాయకులు సంజయ్‌ని సన్మానించారు. 

హైదరాబాద్‌, వరంగల్‌ అర్బన్‌లో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో సంజయ్‌ మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌పై ప్రకటనలకే పరిమితం కాకుండా అమలు చేసి చూపాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో మాదిరిగా కమిటీల పేరిట బట్టేబాజ్‌ పనులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 

రెండేళళ్లగా రిజర్వేషన్‌ లేక వేలాది మంది అర్హత ఉన్న అగ్రవర్ణ పేదలు తీవ్రంగా నష్టపోయారని, దీనికి బాధ్యత వహిస్తూ కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ చేపట్టిన ఆందోళనతోనే కేసీఆర్‌ దిగివచ్చారని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్‌ రూపకల్పనలో కేసీఆర్‌ కృషి 90శాతమని, మోదీ కృషి 10శాతమేనంటూ టీఆర్‌ఎస్‌ ప్రచారం చేసుకుంటోందని చెబుతూ.. కేసీఆర్‌ కృషి ఉన్న వ్యాక్సిన్‌ వేరే అని వ్యంగ్యంగా అన్నారు. 

.