కేంబ్రిడ్జి అనలిటికా, గ్లోబల్‌ సైన్స్‌ రీసెర్చ్  పై సిబిఐ కేసు 

5.62 లక్షల మంది భారత్‌కు చెందిన ఫేస్‌బుక్‌ వినియోగదారుల వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ప్రముఖ బ్రిటన్కు చెందిన కంపెనీ కేంబ్రిడ్జి అనలిటికా, గ్లోబల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ లిమిటెడ్‌ (జిఎస్‌ఆర్‌ఎల్‌)పై సిబిఐ శుక్రవారం కేసు నమోదు చేసింది. 
 
తమ అనుమతి తీసుకోకుండా 5 లక్షలకు పైగా ఫేస్‌బుక్‌ ఖాతాదారుల సమాచారాన్ని దొంగిలించినట్లు 2018లో మీడియా కోడై కూయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దీనిపై సిబిఐతో దర్యాప్తు చేస్తామని ఎలక్ట్రానిక్స్‌, సమాచార సంకేతిక శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అప్పట్లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
కాగా, ప్రాథమిక విచారణలో కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా, జిఎస్‌ఆర్‌ఎల్‌ నేరానికి పాల్పడ్డాయని వెల్లడైంది. దీంతో ఈ వీటిపై కేసులు నమోదయ్యాయి.
గ్లోబల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ 2014లో ‘దిస్‌ ఈజ్‌ యువర్‌ డిజిటల్‌ లైఫ్‌’ అనే యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
పరిశోధన, విద్యా సంబంధిత అవసరాల కోసం తన వినియోగదారుల సమాచారాన్ని సేకరించేందుకునేందుకు గ్లోబల్‌ రీసెర్చికి ఫేస్‌బుక్‌ అనుమతినిచ్చింది. తర్వాత ఈ డేటాను వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకునేందుకు గ్లోబల్‌ రీసెర్చితో కేంబ్రిడ్జి అనలిటికా అక్రమంగా ఒప్పందం కుదుర్చుకుంది.
ఇలా అక్రమంగా కేంబ్రిడ్జి అనలిటికా చేతుల్లోకి వెళ్లింది. సమాచారం చోరీ అయ్యిందని అప్పట్లో ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ సైతం అంగీకరించారు. 2016 అమెరికా ఎన్నికల్లో రాజకీయ సహాయ సంస్థ కేంబ్రిడ్జి అనలిటికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌నకు అనుకూలంగా పనిచేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.