పార్లమెంట్‌ ప్యానెల్ ముందుకు ఫేస్‌బుక్‌

వాట్సాప్‌ నూతన ప్రైవసీ పాలసీపై ఫేస్‌బుక్‌ పార్లమెంట్‌ ప్యానెల్‌ విచారణను ఎదుర్కోనుంది. వాట్సాప్‌ నూతన పాలసీలను ఉపసంహరించుకోవాలని కేంద్రం ఇటీవల ఫేస్‌బుక్‌ను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ విచారణకు హాజరుకానుంది. 
 
వాట్సాప్‌ ప్రైవసీ పాలసీలో ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చింది. వినియోగదారులపై ప్రభావం ఏవిధంగా ఉంటుంది… తదితర ప్రశ్నలను ఎదుర్కోనున్నట్లు తెలుస్తున్నది. కాగా, ఈ అంశంపై స్పందించేందుకు వాట్సాప్‌ నిరాకరించింది. 
 
ఈ నూతన విధాన నిబంధనలతో భారతీయ వినియోగదారులు వాట్సాప్‌ నుండి వైదొలిగే అవకాశం ఉందని, దీంతో ఈ మార్పులను ఉపసంహరించుకోవాలని ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ వాట్సాప్‌కు పంపిన ఈ మెయిల్‌లో కోరింది.
 
ఈ నిబంధనలు, బ్రిటన్‌ వినియోగదారులకు వేరుగా ఉన్నాయని, దీంతో భారత్‌ వినియోగదారుల పట్ల వివక్షత చూపుతున్నట్లు ఉందని, అలాగే వాట్సాప్‌ వినియోగదారుల సమాచారమంతా ఫేస్‌బుక్‌కు వెళుతుందని, ఇది గోప్యతా నిబంధనల ఉల్లంఘనేనని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. 
 
మరోవైపు, ఇతర మెసేజింగ్‌ యాప్‌లైన సిగల్‌, టెలిగ్రామ్‌లను వినియోగించాలని పలువురు నిపుణులు సూచిస్తుండటంతో.. వాట్సాప్‌ ఈ కొత్త పాలసీ ఫిబ్రవరి 8 నుండి అమల్లోకి వస్తుందని ముందు ప్రకటించింది. వినియోగదారుల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో మే నెల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, 400 మిలియన్‌ల వినియోగదారులతో భారత్‌లో వాట్సాప్‌ అతిపెద్ద మార్కెట్‌ను కలిగి ఉంది.