ఆవిష్కరణల సూచీలో నాలుగో స్థానంలో తెలంగాణ  

 ఆవిష్కరణల సూచీలో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. వ్యవస్థీకృత మూలధన ఒప్పందాలు, సులభతర వాణిజ్యం, శాస్త్ర, సాంకేతిక, ఉన్నత, సాంకేతిక విద్యా రంగాలకు పెట్టిన ఖర్చు, భద్రత, పారిశ్రామిక క్లస్టర్ల సంఖ్య లాంటి కీలకాంశాల ఆధారంగా నీతి ఆయోగ్‌ నివేదిక రూపొందించింది. 
 
ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌–2020 పేరిట రెండో ఎడిషన్‌ను నీతి ఆయోగ్‌ బుధవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఢిల్లీ ప్రథమ స్థానంలో నిలవగా, లక్షద్వీప్‌ కేంద్రపాలిత ప్రాంతం చివరి స్థానంలో ఉంది.
 
 మూడు కేటగిరీలుగా ఈ ర్యాంకులు ఇవ్వగా, పెద్ద రాష్ట్రాల జాబితాలో తొలి 5 ర్యాంకులు దక్షిణ భారతదేశానికి చెందిన నాలుగు రాష్ట్రాలకు దక్కాయి. రాష్ట్రాల విషయానికి వస్తే ఆవిష్కరణల సూచీ స్కోరును పోల్చేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ఇందులో పెద్ద రాష్ట్రాలు, పర్వత ప్రాంతాలు, కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి.
 
పెద్ద రాష్ట్రాల కేటగిరీలో తొలి స్థానంలో కర్ణాటక నిలిచింది. తదుపరి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బిహార్‌ నిలిచాయి. 
 
కేంద్ర పాలిత ప్రాంతాలు, నగరాలు రాష్ట్రాలుగా ఉన్న కేటగిరీలో ఢిల్లీ, చండీగఢ్, డామన్‌ డయ్యూ తొలి మూడు స్థానాల్లో నిలవగా, ఈశాన్య, పర్వత ప్రాంత రాష్ట్రాల కేటగిరీలో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. వ్యవస్థీకృత మూలధన ఒప్పందాలు, జియోగ్రాఫికల్‌ ఇండికేటర్ల ఏర్పాటు, ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల కారణంగా కర్ణాటకకు మొదటి స్థానం దక్కిందని నివేదిక వెల్లడించింది. రెండో స్థానంలో మహారాష్ట్ర (38) ఉండగా, బిహార్‌ (14.5) చివరి స్థానంలో నిలిచింది.