సీరం అగ్ని ప్రమాదంలో ఐదుగురు కార్మికుల దుర్మరణం

సీరం ఇనిస్టిట్యూట్‌కు చెందిన నూతన ప్లాంట్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని మేయర్ మురళీధర్ మోహోల్ వెల్లడించారు. అయితే భవనంలో ఎందుకు మంటలు చెలరేగాయన్నది ఇంకా పూర్తిగా నిర్ధారణకు రాలేదని, జరుగుతున్న వెల్డింగ్ పనుల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తాము ఊహిస్తున్నట్లు మేయర్ మురళీధర్ ప్రకటించారు.
పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్‌లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టెర్మినల్ గేట్-1 దగ్గర ఉన్న భవనం ఐదో అంతస్తులో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు పది అగ్నిమాపక యంత్రాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. మొదట్లో ఐదు అగ్ని మాపక యంత్రాలు మాత్రమే చేరుకున్నాయి. మంటలు  అదుపు కాకపోవడంతో అధికారులు మరో ఐదు అగ్ని మాపక యంత్రాలను రప్పించారు.
 
కాగా,  అగ్ని ప్రమాదంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయమూ లేదని సంస్థ ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరమ్ ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తోంది. 4,5 అంతస్తుల్లో  మంటలు వ్యాపించాయి.  ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని ‘మంజరీ’ అని పిలుస్తారు. వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే ప్రదేశం నుంచి కాస్త దూరంలో ఉంటుంది.
ఎస్‌ఐఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సురేష్‌ జాదవ్‌ మాట్లాడుతూ.. బీసీజీ వ్యాక్సిన్‌ సంబంధిత పనులు జరుగుతున్న ప్రాంతంలో మంటలు సంభవించాయని పేర్కొన్నారు. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీ, నిల్వ ఈ ప్రాంతానికి దూరంగా ఉందని తెలిపారు. పీఎంసీ చీఫ్‌ ఆఫీసర్‌ ప్రశాంత్‌ రాన్‌పైస్‌ మాట్లాడుతూ  భవనంలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు. వీరిలో ముగ్గురిని రక్షించినట్లు వెల్లడించారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్ప‌త్తిదారుడిగా సీరం సంస్థ‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ది.  పుణెలో సుమారు వంద ఎక‌రాల్లో ఆ సంస్థ విస్త‌రించి ఉన్న‌ది.