వివాదంలో మరో వెబ్‌ సిరీస్‌ ‘మిర్జాపూర్‌’ 

వెబ్ సిరీస్ లను వివాదాలు వెంటాడుతున్నాయి.  ’తాండవ్‘ వెబ్ సిరీస్ వివాదం మరువక ముందే మరో వెబ్‌ సిరీస్‌ ‘మిర్జాపూర్‌’ కూడా వివాదాల్లో చిక్కుకుంది. ఈ రెండింటిని అమెజాన్ వెబ్ సిరీస్ లో విడుదలకు సిద్ధం కావడం గమనార్హం. గత నవంబర్ లో నెట్ ఫిక్స్ వెబ్ సీరియల్ `ఎ  సూటబుల్ బాయ్’ సహితం ఇటువంటి విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే. 
 
ఉత్తరప్రదేశ్‌ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ దాఖలైన పిటిషన్‌ మేరకు వెబ్‌ సిరీస్‌ నిర్మాతలకు, అమెజాన్‌ప్రైమ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. యుపిలోని మిర్జాపూర్‌కు చెందిన ఒక జర్నలిస్ట్‌, రచయిత అరవింద్‌ చతుర్వేది ఈ సిరీస్‌లో మత, ప్రాంతీయ, సామాజిక మనోభావాలను దెబ్బతీయడంతో పాటు అక్రమ సంబంధాలను ఎక్కువ ఫోకస్‌ చేశారంటూ ఫిర్యాదు మేరకు యుపి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 
 
అరవింద్ చతుర్వేది ఫిర్యాదు మేరకు `మిర్జాపూర్’ వెబ్ సిరీస్ నిర్మాతలు, ఒటిటి వేదిక అమెజాన్ లపై సంబంధీత సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసిన్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ అజయ్ కుమార్ తెలిపారు. దీంతో ఈ కేసును దర్యాప్తు చేసేందుకు యుపి పోలీస్‌ బృందం ముంబయికి చేరుకుంది. యుపిలోని మిర్జాపూర్‌ నగరాన్ని ఉగ్రవాదుల స్థావరంగా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా ఈ వెబ్‌ సిరీస్‌లో చిత్రీకరించినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
అలాగే ఈ సిరీస్‌ కథాంశం, సంభాషణలు తన మనోభావాలను, మతాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, తప్పుడు భావన కలిగేలా చిత్రీకరించారని ఆరోపించారు. కాగా అప్పట్లో ఈ సిరీస్‌ మీద మీర్జాపూర్‌ ఎంపీ అనుప్రియ పటేల్‌ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంలో మీర్జాపూర్‌ ప్రశాంతతకు కేంద్రంగా ఉందని, కానీ వెబ్‌ సిరీస్‌లో ఈ నగరాన్ని హింసాత్మకంగా చూపించి దాని ప్రతిష్టను దిగజార్చారని మండిపడ్డారు.
ఇక రెండు సిరీస్‌లుగా వచ్చిన మీర్జాపూర్‌లో పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, విక్రాంత్‌ మాస్సే, శ్వేత త్రిపాఠి, హర్షిత గౌర్‌ తదితరులు నటించారు. ఈ వెబ్‌ సిరీస్‌కు కరణ్‌ అన్షుమన్‌, గుర్మీత్‌ సింగ్‌లు దర్శకత్వం వహించారు. ఎక్సెల్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఫర్హాన్ అక్తర్, రితేశ్‌ సిద్వానీ దీన్ని నిర్మించారు.
ఇటీవల హిందూ దేవుళ్లను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానున్న తాండవ్‌ను కూడా ఇదేవిధంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాండవ్‌పై కూడా మూడు కేసులు నమోదయ్యాయి. సైఫ్‌ అలీఖాన్‌, డింపుల్‌ కపాడియా నటించిన ఈ తాండవ్‌ సిరీస్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. యుపికి చెందిన మరో పోలీస్‌ బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.
కాగా, తాండవ్‌ సిరీస్‌ నిర్మాతలు, నటులు, సిబ్బంది క్షమాపణలు చెప్పిన అనంతరం సిరీస్‌లో మార్పులు చేసేందుకు అంగీకరించారు.  ఈ నేపథ్యంలో ఓటీటీలో ఇష్టారీతిన వస్తున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌ కంటెంట్‌ను నియంత్రించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.