తొలిసారి నిప్పులు విరజిమ్మిన రఫెల్ యుద్ధ విమానాలు 

తొలిసారి నిప్పులు విరజిమ్మిన రఫెల్ యుద్ధ విమానాలు 

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గురువారం ఉదయం భారత దేశపు  రాఫెల్ యుద్ధ విమానాలు తొలిసారిగా తన నిప్పులు విరజిమ్మాయి. భారత వైమానిక దళం, ఫ్రాన్స్ డిజర్ట్‌ నైట్-21 పేరిట బుధవారం ప్రారంభించిన సంయుక్త విన్యాసాలు ఈ నెల 24 వరకు కొనసాగుతాయి.  తొలుత ఇరుదేశాల రాఫెల్ జెట్లు ఎగురగా, అనంతరం సుఖోయ్, మిరాజ్‌లు కూడా ఆకాశంలో నిప్పులు చిమ్మాయి.

జనవరి 26 నాడు కొత్త ఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో తొలిసారి ప్రదర్శనకు రానున్న రాఫెల్‌ యుద్ధ విమానాలు అంతకు ముందు రిహార్సల్‌గా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌లో గాలిలోకి ఎగిరాయి. తొలిరోజు యుద్ధ వ్యూహాలపై చర్చించిన భారత్‌, ఫ్రాన్స్‌ దేశాలకు చెందిన వైమానిక దళ అధికారులు గురువారం ఉదయం పూర్తి సన్నాహాలతో ఆకాశంలోకి లేచాయి. 

ఈ విన్యాసాలు  జోధ్పూర్-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో జరుగుతున్నాయి. ఆకాశంలో గింగిరాలు తిరుగుతూ విన్యాసాలు చేసిన ఇరు దేశాల విమానాలు ఆ తరువాత ఒకరినొకరు మోసగించుకోవడం ద్వారా గగనతలంలోకి ప్రవేశించే దశ ప్రారంభమైంది. దాడి, రక్షణాత్మక పాత్రలపై ప్రాక్టీస్‌ కొనసాగింది. 

ఎదురు జట్టు భద్రతా వలయం  లోపలికి చొచ్చుకువచ్చి దాడిని ప్రాక్టీస్ చేశారు. అలాగే, ఇరు జట్లు గాలిలో ఒకదానికొకటి విమానాల నుంచి డమ్మీ క్షిపణులను పేల్చాయి. దాదాపు ఒకటిన్నర గంటలపాటు ఆకాశంలో సామర్థ్య పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.

జోధ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌లో ఐ రూంను ప్రత్యేకంగా నిర్మించారు. వ్యాయామంలో పాల్గొనే ప్రతి విమానం, పైలట్ల కదలికలను ఇరు దేశాల నిపుణులు ఇక్కడి నుంచి నిశితంగా పరిశీలిస్తారు. వారి సూచనల మేరకు, ఇద్దరు యోధుల మధ్య విన్యాసాలు జరుగుతాయి. ఇందులో, వ్యాయామం చేసేటప్పుడు బహిర్గతమయ్యే లోపాలను గుర్తించి వాటిని అధిగమించడం ఎలాగో వివరిస్తారు.