ప్ర‌ధాని మోదీ, ముఖ్య‌మంత్రుల‌కు రెండో ద‌శ‌లో టీకా !

ప్ర‌ధాని నరేంద్ర మోదీతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండో దశ‌లో కోవిడ్ టీకా తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.  ఇటీవ‌ల ముఖ్య‌మంత్రుల‌తో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ రాజ‌కీయ‌వేత్త‌లతో పాటు 50 ఏళ్లు దాటిన వారు రెండ‌వ రౌండ్‌లో టీకా తీసుకోవాల‌న్న సూచ‌న చేశారు.  
తొలి ద‌శ‌లో కేవ‌లం ఫ్రంట్‌లైన్‌, హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు మాత్ర‌మే టీకా వేస్తున్న విష‌యం తెలిసిందే.  దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీ జోరుగా సాగుతోంది.   ఇప్పటివరకు దేశంలో 8,06,484 మంది హెల్త్ కేర్ వ‌ర్క‌ర్లు టీకాలు వేసుకున్న‌ట్లు కేంద్రం పేర్కొన్న‌ది.     
 
ఇలా ఉండగా, గడిచిన ఒక్కరోజులో భారత్ లో 15,223 మంది కరోనా బారినపడ్డారని  కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు గురువారం ఉదయం తెలిపారు. గడిచిన ఒక్కరోజులో 19,965 మంది కోలుకున్నారని వారు చెప్పారు. 
ఇప్పటివరకు భారత్ లో కరోనా బారినపడిన వారి సంఖ్య   1,06,10,883కు చేరిందని, గడిచిన ఒక్కరోజులో కరోనాతో 151 మంది చనిపోయారని వారు వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో కరోనాతో  1,52,869 మంది చనిపోయారని అధికారులు పేర్కొన్నారు.