హౌరా-కాల్కా మెయిల్ ఇకపై.. ‘నేతాజీ ఎక్స్‌ప్రెస్’

ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ జయంతికి ముందు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. హౌరా-కాల్కా మెయిల్ పేరును ‘నేతాజీ ఎక్స్‌ప్రెస్‌’గా మార్పు చేసింది. 
 
ఈ మేరకు బుధవారం ట్విట్టర్‌లో రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. నేతాజీ పరాక్రమం భారతదేశం స్వేచ్ఛ, అభివృద్ధిని ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో నిలిపిందని కొనియాడింది. తూర్పు రైల్వే పరిధిలోని హౌరా నుంచి పశ్చిమ రైల్వే పరిధిలోని కాల్కా వరకు దేశ రాజధాని ఢిల్లీ మీదుగా ప్రయాణించే హౌరా-కాల్కా మెయిల్ దేశంలోనే ప్రసిద్ధ, పురాతన రైలు అని వెల్లడించింది.   
నేతాజీ 125వ జయంతి ఉత్సవాలను ఈ నెల 23నుండి సంవత్సరంపాటు దేశ వ్యాప్తంగా జరపాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించిన తదుపరి ఒకొక్క మంత్రిత్వ శాఖ ఒకొక్క విధంగా నేతాజీ స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు పలు రకాల కార్యక్రమాలు చేబడుతున్నాయి. నేతాజీ జయంతిని `పరాక్రమ దివస్’ గా పాటించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉత్తరువులు జారీచేసింది.