క్యాన్సర్‌ వైద్య నిపుణురాలు శాంత మృతి  

క్యాన్సర్‌ వైద్య నిపుణురాలు, చెన్నైలో ని అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ వీ శాంత (93) కన్నుమూశారు. మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో చెన్నైలో ఆమె మరణించారు. 

ఛాతీ నొప్పితో సోమవారం రాత్రి కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారని, చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3.35 గంటలకు మరణించారని వైద్యులు తెలిపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం పాత క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రాంగణానికి తరలించినట్లు వెల్లడించారు. శాంత, తన గురువు ఎస్‌.కృష్ణమూర్తి సహకారంతో ఈ భవనాన్ని నిర్మించారని తెలిపారు.

కాగా, ఆమె ఎంబిబిఎస్‌తో పాటు గైనకాలజీలో ఎండి చేశారు. మద్రాస్‌లోని ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుకు మద్రాస్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆమెను ఎంపిక చేశారు. అనంతరం ఆమె ముత్తులక్ష్మి రెడ్డి నాయకత్వంలో 1954లో ఉమెన్స్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ క్యాన్సర్‌ రిలీఫ్‌ ఫండ్‌తో స్థాపించబడిన క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు.

కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌తో ఆరోగ్య సంరక్షణలో వచ్చిన కొత్త సవాళ్లను గురించి ప్రత్యేకంగా హిందూ పత్రిక ద్వారా ప్రజలకు వివరించారు. తన కెరీర్‌లో 60 ఏళ్ల పాటు క్యాన్సర్‌ రోగులకు చికిత్సనందించడం, క్యాన్సర్‌ వ్యాధిపై అధ్యయనం, నివారణ, నియంత్రణ వంటి పలు అంశాలపై దృష్టి సారించారు.

ఆమె అందించిన సేవలకు గాను 1986లో పద్మశ్రీ, 2006లో పద్మ భూషణ్‌, 2016లో పద్మవిభూషణ్‌ అవార్డులతో ప్రభుత్వం సత్కరించింది. 2005లో రామన్‌ మెగసెసే అవార్డుతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆమె మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్‌ పురోహిత్‌ భన్వరీలాల్‌, ముఖ్యమంత్రి పళనిస్వామిలు సంతాపం తెలిపారు. అధికార లాంఛనాలతో ఆమె పార్థీవ దేహానికి అంత్యక్రియలు జరపనున్నట్లు ప్రకటించారు.