సొంత పార్టీ పెట్టే యోచనలో ట్రంప్

అమెరికా అధ్యక్షపదవి నుంచి ఎట్టకేలకు వైదొలిగిన డొనాల్డ్‌ ట్రంప్‌ సొంతంగా ఓ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. దీని పేరు: పేట్రియట్‌ పార్టీ. తక్షణం కాకపోయినా సరైన సమయంలో దీన్ని ప్రారంభించాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. 
 
కేపిటల్‌ భవనంపై దాడి తరువాత దేశవ్యాప్తంగా తనకు ప్రతికూలత ఉన్నట్లు ట్రంప్‌ అభిప్రాయపడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ గొడవ కాస్త చల్లారుతుందని, ఆ తరువాత నెమ్మదిగా మళ్లీ తాను తెరపైకి రావాలని యోచిస్తున్నట్లు  డెయిలీ మెయిల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. 
తన ఓటమిని అంగీకరించని ట్రంప్‌…నూతనాధ్యక్షుడు జో బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు.
 
కాగా, వైట్‌ హౌస్‌ను వీడే సమయంలో తన చివరి సందేశాన్నిచ్చిన ట్రంప్‌.. దేశం కోసం శ్రమించేందుకు లక్షలాది మంది ఉన్నారని, మనమంతా కష్టించి దేశ చరిత్రలోనే ఓ గొప్ప రాజకీయ ఉద్యమాన్ని చేపట్టామని,. ఈ ఉద్యమం అంతం కాదు. ఆరంభం మాత్రమే’ అంటూ ట్వీట్‌ చేశారు. కఠినమైన నిర్ణయాలు, తీవ్ర పోరాటాలెన్నో చేశానని, మీ అవసరాలే తన మొదటి ప్రాధాన్యంగా భావిస్తానని పేర్కొన్నారు.
అదేవిధంగా వీడ్కోలు సందేశంలో కూడా కొత్త పాలక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ప్రసంగం మొత్తంలో కనీసం బైడెన్‌ పేరు ఎత్తనే లేదు. అమెరికా సుభిక్షంగా, భద్రంగా ఉంచడంలో కొత్త బృందానికి శుభాకాంక్షలను తెలియజేస్తూ…వారికి అదృష్టం కూడా కలిసి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అదే విధంగా తన హాయాంలో సాధించిన కొన్ని విజయాలను వల్లె వేసుకున్నారు.

“దేశాన్ని యుద్ధాల వైపు తీసుకెళ్లకుండా చేసిన అధ్యక్షుణ్ణి ఇటీవలి చరిత్రలో నేనే. సిరియా, అఫ్గానిస్థాన్‌లతో పాటు ప్రపంచమంతటా స్థావరాల్లో ఉన్న మన వేలాది సైనిక బలగాలను వెనక్కి తీసుకొచ్చినదీ నేనే.. కఠినమైన దౌత్యనీతితో అనేకదేశాలను కట్టడి చేశాం. చైనాను దీటుగా ఎదుర్కొన్నాం. కొవిడ్‌ మహమ్మారికి కారణమైన  డ్రాగన్‌పై ఎన్నో వాణిజ్య ఆంక్షలు తెచ్చి, వారికి వ్యతిరేకంగా ప్రపంచదేశాలను కూడగట్టాం” అని తెలిపారు. 

మధ్యప్రాచ్యంలోనూ శాంతిని నెలకొల్పే చరిత్రాత్మక ఒప్పందాన్ని సాకారం చేశాం. నాయకత్వ పటిమను ప్రపంచదేశాలకు తెలియజెప్పాం. తద్వారా ప్రపంచం మనల్ని గౌరవించేట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. ‘‘ఓ శక్తిమంతమైన దేశంగా అమెరికా ప్రపంచవ్యాప్తంగా ముప్పును ఎదుర్కొంటూనే ఉంటుంది. కానీ అంతకంటే  పెద్ద ప్రమాదం ఏంటంటే.. మన మీద మనకి విశ్వాసం సన్నగిల్లడం. ఇది జరిగితే మనకి ముప్పు వాటిల్లినట్లే’’ అని హెచ్చరించారు.