అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం నేడే 

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ కూడా ప్రమాణం చేస్తారు. ఈ పదవి చేపడుతున్న తొలి మహిళగా, భారతీయ సంతతికి చెందిన తొలి వ్యక్తిగా, ఆఫ్రికన్‌- ఏషియన్‌ మూలాలున్న వ్యక్తిగా ఆమె చరిత్రకెక్కబోతున్నారు. 

బైడెన్‌ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఒక వైపు కరోనా, మరో వైపు ట్రంప్‌ అనుచర సాయుధ మూకల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఈ సారి ప్రమాణస్వీకార కార్యక్రమం కొంత భిన్నంగా వుండబోతుంది. ఇంతకుముందు ఉన్నంత జన సందోహం ఇప్పుడు వుండదు. 

కేవలం వెయ్యి మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువమంది కాంగ్రెస్‌ సభ్యులు, వారి అతిథులు మాత్రమే వుంటారు. పదవి నుండి వైదొలగుతున్న అధ్యక్షుడు ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి హాజరుకానని ఇప్పటికే చెప్పారు. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో (భారత్‌లో రాత్రి 8.30) అధ్యక్షుని ప్రమాణ స్వీకార కమిటీ (పిఐసి) కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తుంది. 

 సంప్రదాయాలకు విరుద్ధంగా డొనాల్డ్‌ ట్రంప్‌ – బైడెన్‌ ప్రమాణస్వీకారానికి గైర్హాజరవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ముందుగానే ప్రకటించారు.   అధ్యక్షుడిగా బుధవారం ఆఖరి రోజును గడుపనున్న ట్రంప్‌నకు ఘనమైన వీడ్కోలు ఇవ్వడానికి అమెరికన్‌ మిలిటరీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య రెడ్‌ కార్పెట్‌పై ట్రంప్‌ దంపతులకు ఊరేగింపు జరుగనున్నది.

కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన లక్షల మందికి నివాళులర్పించడంతో కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ తన ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నారు. సొంత రాష్ట్రం డెలావర్‌లోని విల్మింగ్టన్‌ నుంచి ఆయన మంగళవారం రాత్రి వాషింగ్టన్‌ చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుఝామున లింకన్‌ మెమోరియల్‌ పూల్‌ వద్ద ఆయన అనేకమంది ప్రముఖులతో కలిసి నివాళులర్పిస్తారు. అటు బైడెన్‌ ఎంపిక చేసుకున్న మంత్రివర్గానికి, ఇతర కీలక నియామకాలకు కాంగ్రెస్‌ లాంఛనంగా ఆమోదముద్ర వేసింది.