దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులపై హైకోర్టు ఆగ్రహం 

దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులపై హైకోర్టు ఆగ్రహం 

రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ముగ్గురు దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పిటిషనర్లపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ 120బీ (నేరపూరిత కుట్ర), 143(అక్రమ సమావేశం), 341(అక్రమంగా నిలువరించడం) సెక్షన్ల నమోదును రద్దు చేసింది. ఐపీసీ 506(నేరపూరిత బెదిరింపు) కింద మాత్రమే దర్యాప్తు చేసేందుకు పోలీసులకు అవకాశం కల్పించింది. 

ఈ మేరకు హైకోర్ట న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి తీర్పు ఇచ్చారు. 3 రాజధానులకు అనుకూలంగా గత ఏడాది అక్టోబరు 23న తాళ్లాయపాలెం వద్ద జరిగే  కార్యక్రమానికి వెళ్తున్న వారిని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారు. 

ఇరువర్గాలకు సర్దిచెప్పడానికి వెళ్లిన తనను దూషించి ట్రాక్టర్‌తో తొక్కిస్తామని బెదిరించారంటూ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఈపూరి రవిబాబు 11 మందిపై మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో  వా రిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమో దు చేశారు. వీరిలో ముగ్గురు దళితులు ఉన్నారు.  తమపై పెట్టిన కేసులను రద్దు చేయాలని కోరుతూ ఎస్సీ వర్గానికి చెందిన ఈపూరి జయకృష్ణ, ఈపూరి ఇస్మాయిల్‌, సీహెచ్‌ రాహుల్‌ హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషనర్ల తరఫు న్యాయవాది ఇంద్రనీల్‌ బాబు వాదనలు వినిపిస్తూ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీలైన పిటిషనర్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. పిటిషనర్లు ఎస్సీలని నిరూపించేందుకు కుల ధ్రువీకరణ పత్రాలను కూడా కోర్టుకు సమర్పించారు.

ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఫిర్యాదుదారుడి ఇంటి పేరుతో ఉన్నవారిపై ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పారు.