రామతీర్థ ఘటనలపై కళావెంకట్రావు అరెస్టు 

రామతీర్థ ఘటనలపై కళావెంకట్రావు అరెస్టు 

టీడీపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావును బుధవారం రాత్రి విజయనగరం జిల్లా పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భోగాపురం సీఐ శ్రీధర్‌ ఆధ్వర్యంలోని ఎస్టీఎఫ్‌ బృందాలు శ్రీకాకుళం జిల్లా రాజాంలోని ఆయన ఇంటి వద్దే ఆయన్ను అదుపులోకి తీసుకున్నాయి. 

ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలకు కళాను బాధ్యుడిని చేస్తూ, విజయసాయిపై దాడికి పురిగొల్పారన్న ఆరోపణలతో అరెస్టు చేసి చీపురుపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. 

రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ప్రత్యేక బృందాలు కళా వెంకట్రావు ఇంటిని, కార్యాలయాన్ని చుట్టుముట్టాయి. సీఐ శ్రీధర్‌తో పాటు మరికొంత మంది పోలీసులు నేరుగా ఇంట్లోకి వెళ్లారు. కళా, ఆయన వ్యక్తిగత సహాయకులు, ఇతర సిబ్బంది చేతుల్లోని సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కళాతో సీఐ 20 నిమిషాలు చర్చించారు. రామతీర్థంలో జరిగిన సంఘటనకు సంబంధించి అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు.

ఇదే సమయంలో మీడియాతో మాట్లాడేందుకు కళా ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా వాహనంలోకి తోసివేశారు. ఇదే సమయంలో కళా తనతో పాటు తీసుకువెళ్లాల్సిన లగేజీ బ్యాగు కింద పడిపోయింది. బ్యాగును ఇచ్చేందుకు యత్నించిన ఆయన వ్యక్తిగత సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను తరలిస్తున్న వాహనం వెనుక డోర్‌ సైతం వేయకుండానే ఇంటి నుంచి తరలించారు.  అనంతరం స్టేషన్‌ బెయిల్‌పై ఆయన్ను విడుదల చేశారు.

ఈ అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపిచ్చారు. చీపురుపల్లి పోలీసు స్టేషన్‌ వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు.

దేవుళ్లపై దాడుల చేయడం అన్యాయమని అన్నందుకే తమపై కేసులు బనాయించారని కళావెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. చీపురుపల్లి స్టేషన్‌ నుంచి విడుదలైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో ఆయనే ఐపీసీ సెక్షన్లు వేసి అరెస్టులకు పురిగొల్పారని ఆరోపించారు.

చంద్రబాబు, తాము కుట్ర చేసి విజయసాయిరెడ్డిపై దాడి చేయించినట్లు, హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. దాడులు, కక్ష సాధింపులతో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. అనంతరం పోలీసు స్టేషన్‌ నుంచి గాంధీజీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. సుమారు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారిగా కళావెంకట్రావుపై కేసు నమోదు కావడం గమనార్హం.

కాగా, విజయసాయి రెడ్డి నెల్లిమర్ల పోలీసు స్టేషనులో ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ నిమిత్తం, సంఘటన వివరాలు తెలుసుకొనేందుకే టిడిపి సీనియర్‌ నేత కిమిడి కళా వెంకటరావును అదుపులోకి తీసుకుని విచారించామని, అనంతరం నోటీసు ఇచ్చి తిరిగి పంపించామని విజయనగరం జిల్లా ఎస్‌పి బి.రాజకుమారి తెలిపారు