స్థానిక ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

స్థానిక ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం వచ్చే మార్చ్ చివరిలో ముగిసే వరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగకుండా చూడాలని ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. 

ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు విముఖత చూపింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిర్వహించాల్సిన అవసరం ఉండటం, కరోనా కొత్త కేసుల నమోదు తదిరత కారణాలతో ఎన్నికల షెడ్యూల్‌ను నిరాకరిస్తూ కోర్టును ఆశ్రయించింది.

పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇటీవల ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రెండు రోజులు విచారణ జరిపిన హైకోర్టు సిజె జస్టిస్‌ ఎకె గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పును వెలువరించింది.

పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఎస్‌ఈసీ దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని,  ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది.

ఈనెల 8న ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ ప్రకటించింది. ఈ తీర్పుపై స్పందిస్తూ హైకోర్టు ఆదేశాల ప్రకారం 4 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.

`గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉంది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈ విషయాన్ని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లాం?. ఎన్నికలకు సహకరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తాం’ అని రమేష్‌ కుమార్ మీడియాకు వెల్లడించారు.

కాగా ఈ తీర్పుపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నేతలు స్పందిస్తూ స్వాగతించారు. మరోవైపు  హైకోర్టు తాజా తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.