ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటిన టీమిండియా  

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సత్తా చాటింది. కంగారూల గడ్డపై వరుసగా రెండో సారి ట్రోఫీ గెలిచింది. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో రహానే సేన ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ నిర్ధేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 
 
దీంతో నాలుగు మ్యాచుల టెస్ట్‌ సిరీస్‌ 2-1తో భారత్‌ కైవసం చేసుకుంది. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (89 నాటౌట్‌) అర్ధ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ (91), టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా (56) అర్ధ సెంచరీలతో రాణించారు. ఈ విజయంతో కెప్టెన్‌ అజింక్య రహానే చరిత్రను తిరగరాశాడు. తాను సారథ్యం వహించిన ఏ టెస్టులోనూ భారత్‌ ఓడిపోలేదు.
 
 ఆస్ట్రేలియాపై బ్రిస్బేన్‌లో సాధించిన చారిత్ర‌క విజ‌యంతో టీమిండియా మ‌రోసారి టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో నంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కూ తొలి స్థానంలో ఉన్న ఆసీస్ మూడోస్థానానికి దిగ‌జారింది. ఇప్ప‌టి వ‌ర‌కూ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగా 5 సిరీస్‌ల‌లో 13 టెస్టులు ఆడిన టీమిండియా.. 9 విజ‌యాలు సాధించి, మూడింట్లో ఓడింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
 
 ప్ర‌స్తుతం టీమిండియా ఖాతాలో 430 పాయింట్లు ఉన్నాయి. 71.7 శాతం విజ‌యాలతో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. మ‌రోవైపు ఆస్ట్రేలియా 4 సిరీస్‌ల‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి 8 గెలిచి, నాలిగింట్లో ఓడింది. మ‌రో 2 డ్రాగా ముగిశాయి. ఆసీస్ ఖాతాలో 332 పాయింట్ల ఉండ‌గా.. 69.2 శాతం విజ‌యాల‌తో మూడోస్థానంలో ఉంది. 70.0 శాతం విజయాల‌తో న్యూజిలాండ్ రెండో స్థానంలో కొన‌సాగుతోంది.  
 
ఆస్ర్టేలియా గ‌డ్డ‌పై టీమిండియా చ‌రిత్రాత్మ‌క విజ‌యంపై ప్ర‌ధాని నరేంద్ర మోదీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. భార‌త జ‌ట్టు విజ‌యానికి దేశ‌మంతా గ‌ర్విస్తోంద‌ని మోదీ పేర్కొన్నారు. ఆట‌గాళ్లు త‌మ అభిరుచి, అద్భుత‌శ‌క్తిని ప్ర‌ద‌ర్శించారు అని మోదీ కొనియాడారు. భార‌త జ‌ట్టుకు మోదీ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు.  


నాలుగో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మైదానంలోకి దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లలో రోహిత్‌ శర్మ (44) ఫర్వాలేదనిపించినా యువ ఆటగాడు శుభమన్‌ గిల్‌ (7) నిరాశపరిచాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో టయిలెండర్లు అయిన శార్దూల్‌ ఠాకూర్‌ (67), వాషింగ్టన్‌ సుందర్‌ (62) అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌ను ఆదుకున్నారు.

 
 ఇక కెప్టెన్‌ రహానే (37), మయాంక్‌ అగర్వాల్‌ (38) ఫర్వాలేదనిపించారు. ఆసీస్‌ బౌలర్లలో హాజిల్‌వుడ్‌ 5 వికెట్లు తీయగా.. స్టార్క్‌, కమిన్స్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. నాథన్‌ లౌయన్‌ ఒక వికెట్‌ తీశాడు.
ఇక రెండో ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియాను భారత్‌ బౌలర్లు 294 పరుగులకు ఆలౌట్‌ చేశారు. అనంతర రెండో ఇన్నింగ్‌ ఆడిన భారత్‌ ఏడు వికెట్లు కోల్పోయి 97 ఓవర్లకు 329 పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది.
 
యువ ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్‌ (91) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నా చక్కటి ఇన్నింగ్‌ ఆడి అందరి నుంచి ప్రశంసలు పొందాడు. మరో యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ (89) సైతం చివరి వరకు క్రీజులో ఉండి విజయంలో కీలక పాత్ర పోషించాడు. చతేశ్వర్‌ పుజారా (56) అర్ధసెంచరీతో చెలరేగిపోయాడు.  ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ 4 వికెట్లు పడగొట్టగా.. లైయన్‌ 2, హాజల్‌వుడ్‌ ఒక వికెట్‌ తీశారు.

భారత్  టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో మూడు వంద‌ల‌కుపైగా స్కోర్లు చేజ్ చేసి గెల‌వ‌డం ఇది కేవ‌లం మూడోసారి మాత్ర‌మే. అది కూడా ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై. అందులోనూ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎప్పుడూ గెల‌వ‌ని బ్రిస్బేన్‌లోని గ‌బ్బా స్టేడియంలో ఇంత భారీ స్కోరు ఛేదించ‌డం అనేది సాధార‌ణ విష‌యం కాదు.