ఏటా ‘పరాక్రమ్ దివస్’గా నేతాజీ జయంతి

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ జయంతిని ప్రతి సంవత్సరం ‘పరాక్రమ్ దివస్’గా పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నేతాజీ స్ఫూర్తి, దేశానికి ఆయన అందించిన నిస్వార్థ సేవలను స్మరించుకునేందుకు ఏటా ఆయన జయంతిని ‘పరాక్రమ్ దివస్’గా జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ మంగళవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. 

బ్రిటిష్ వలస పాలకులు భారత్ ను వదిలి వెల్లడిలో నేతాజీ పరాక్రమం నిర్ణయాత్మక పాత్ర వహించడం తెలిసిందే. కేవలం భారత దేశ స్వతంత్రంలోనే కాకుండా ఆసియా, పసిఫిక్ లో సుమారు 60 దేశాలు స్వతంత్రం పొందడానికి అయన స్ఫూర్తి కలిగించారు. 

కోల్‌కతాలోని విక్టోరియల్ మెమోరియల్‌లో ఈనెల 23న జరిగే నేతాజీ జయంత్యుత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అకాశం ఉంది. అలిపోర్‌లోని బల్వెడెర్ ఎస్టేట్‌‌లో ఉన్న నేషనల్ లైబ్రరీని కూడా ప్రధాని సందర్శిచనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్ పర్యటనపై చర్చించేందుకు బెంగాల్ పోలీసులు, ప్రధానికి రక్షణ కల్పిస్తున్న ఎస్‌పీజీ సోమవారంనాడు సమావేశమైనట్టు కూడా తెలుస్తోంది.

విక్టోరియా మెమోరియల్, నేషనల్ లైబ్రరీ ఈవెంట్‌లను ఖరారు చేశారని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే రాజకీయ ఎలాంటి కార్యక్రమాలు ఉండకపోవచ్చని, అయితే త్వరలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతలతో మోదీ సమావేశం కావచ్చని తెలుస్తోంది. 

కాగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పాదయాత్ర నిర్వహించనున్నట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు.