భారత దేశ భద్రతపై ప్రభావం చూపే ప్రతి అంశాన్ని తాము నిశితంగా గమనిస్తూనే ఉన్నామని, చైనా వ్యవహారాలన్నింటినీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత భూభాగంలో చైనా ఓ గ్రామం నిర్మించదన్న వార్తలపై భారత విదేశాంగ శాఖ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
‘‘భారత భూభాగంలో చైనా నిర్మాణ పనులను చేపడుతున్నట్లు ఇటీవల వచ్చిన నివేదికను చూశాం. కొన్నేళ్లుగా చైనా ఇలాంటి మౌలిక సదుపాయాల నిర్మాణ కార్యకలాపాలను చేపడుతూనే ఉంది. దీనికి విరుగుడుగా భారత ప్రభుత్వమూ సరిహద్దు ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలను పటిష్టం చేస్తోంది. రోడ్ల నిర్మాణం, బ్రిడ్జీల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాలను త్వరితగతిన చేపడుతున్నాం.’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.
చైనా భారత భూభాగంలో ఓ గ్రామం నిర్మించిందనే వార్త జాతీయ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అరుణాచల్‌ప్రదేశ్ వద్ద సరిహద్దుకు 4.5 కిలోమీటర్ల లోపల భారత్ భూభాగంలో ఈ నిర్మాణాలు చేపట్టినట్టు సమాచారం. ఎగువ సుబన్ సిరి జిల్లాలోని వివాదాస్పద ప్రాంతంలో ఏకంగా 101 ఇళ్లు నిర్మించినట్టు తెలుస్తోంది. భారత్ భూభాగమైన ఈ ప్రాంతాన్ని చైనా అనేక మార్లు తమకు చెందినదేనంటూ ప్రకటించింది.
గతంలో ఇక్కడ పలు మార్లు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. చైనా ఈ గ్రామం నిర్మించినట్టు శాటిలైట్ చిత్రాల ఆధారంగా నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు 2019 నాటి చిత్రాలతో పోలిస్తే.. గతేడాది నవంబర్‌లో ఈ ప్రాంతంలో ఏకంగా 101 నిర్మాణాలు కనిపించాయి. దీన్ని బట్టి గతేడాదే ఈ గ్రామం ఏర్పాటైనట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
More Stories
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
బంగ్లాదేశ్ లో నమాజ్ సమయంలో దుర్గాపూజపై ఆంక్షలు
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత్ జయకేతనం