మోదీ బొమ్మలతో పాక్ లో `సింధుదేశ్’  నిరసనలు 

భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రపంచ నేతల ఫొటోలతో పాకిస్థాన్ లోని సింధు రాష్ట్రంలో భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. `సింధుస్థాన్’ స్వతంత్రం కోసం ప్రపంచ నేతలు జోక్యం చేసుకోవాలి అంటూ వారు కోరారు. పాకిస్థాన్ నుంచి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల‌ను కోరుకుంటూ చేస్తున్న ఆందోళ‌న‌లో మోదీ ప్ల‌కార్డులు క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.

త‌మ‌కు అరాచ‌క పాకిస్థాన్ నుంచి విముక్తి క‌ల్పించడంలో మోదీలాంటి ప్ర‌పంచ దేశాల నేత‌లు కీల‌క‌పాత్ర పోషించాల‌ని ఆందోళ‌నకారులు కోరుతున్నారు. సింధీ నేష‌న‌లిజం వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌రైన జీఎం స‌య్యద్ 117వ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న సొంతూరైన సింధ్ ప్రావిన్స్‌లోని సాన్‌లో భారీ ర్యాలీ నిర్వ‌హించారు.

పాకిస్థాన్‌కు ఇప్ప‌టికే బ‌లూచిస్తాన్ సెగ గ‌ట్టిగానే త‌గులుతుండ‌గా తాజాగా ఈ సింధూదేశ్ డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. బ‌లూచిస్తాన్‌లాగే పాకిస్థాన్‌లో తాము కూడా వివ‌క్ష‌కు గుర‌వుతున్నామ‌ని, త‌మపై వేధింపులు స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయాయంటూ ప్ర‌త్యేక సింధూదేశ్ కోసం అక్క‌డి సింధీలు ద‌శాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు.

తాజాగా ఈ పోరాటానికి ఊపిరులూదిన జీఎం స‌య్య‌ద్ జ‌యంతి సంద‌ర్భంగా మ‌రోసారి త‌మ ఆకాంక్ష‌ల‌ను బ‌లంగా వినిపించే ప్ర‌య‌త్నం చేశారు. ఘ‌న‌మైన సింధూ లోయ నాగ‌రిక‌త‌కు పేరుగాంచిన సింధ్ ప్రాంతాన్ని మొద‌ట బ్రిటీష‌ర్లు అక్ర‌మంగా ఆక్ర‌మించార‌ని, ఆ త‌ర్వాత దుష్ట ఇస్లామిక్ దేశ‌మైన పాకిస్థాన్‌కు ధారాద‌త్తం చేశార‌ని ఆందోళ‌న‌కారులు ఆరోపిస్తున్నారు. 

కొన్ని ద‌శాబ్దాలుగా పాకిస్థాన్‌లో తాము వివ‌క్ష ఎదుర్కొంటున్నామ‌ని, ఈ వేధింపుల మ‌ధ్య కూడా సింధ్ త‌న ప్ర‌త్యేక‌మైన సాంస్కృతిక గుర్తింపును నిలుపుకుంటూ వ‌స్తున్న‌ద‌ని జీయ్ సింధ్ ముత్త‌హిదా మ‌హ‌జ్ చైర్మ‌న్ ష‌ఫీ ముహ‌మ్మ‌ద్ బుర్ఫాత్ తెలిపారు.

ప్ర‌త్యేక సింధ్ దేశం కోసం ఇప్ప‌టికే అక్క‌డ ప‌లు జాతీయ పార్టీలు ఉన్నాయి. అవ‌కాశం దొరికినప్పుడ‌ల్లా ఈ అంశాన్ని ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై లేవ‌నెత్తుతూనే ఉన్నారు. పాకిస్థాన్ తమ ప్రాంతాన్ని ఆక్ర‌మించింద‌ని, త‌మ వ‌న‌రుల‌ను దోచుకుంటూ మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్పుడుతున్న‌ద‌ని సింధ్ ప్రాంతానికి చెందిన పార్టీలు ఆరోపిస్తున్నాయి. 

ఉగ్ర‌వాద దేశ‌మైన పాకిస్థాన్ నుంచి త‌మ‌కు విముక్తి క‌ల్పించాలంటూ ప్ర‌త్యేక సింధూదేశ్ కోసం ఈ ప్రాంత ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. తొలిసారి 1967లో జీఎం స‌య్య‌ద్ ఈ డిమాండ్‌ను తెర‌పైకి తెచ్చారు. అయితే అప్ప‌టి నుంచీ ఈ ఆందోళ‌న‌ను అణ‌చివేయ‌డానికి పాకిస్థాన్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ఎంతో మంది సింధీ జాతీయ‌వాద నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, విద్యార్థులు అదృశ్య‌మ‌య్యారు. వారిని అక్క‌డి పాక్ ప్ర‌భుత్వం హింసించి చంపిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.