రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ అరెస్ట్ 

రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావెల్నీని ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే పోలీసు బలగాలు ఆయన్ని అదుపులోకి తీసుకున్నాయి. 
 
ఐదు నెలల క్రితం నావెల్నీపై విష ప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. ఈయనపై జరిగిన విష ప్రయోగం వెనుక ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యను అప్పట్లో పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఆయనపై విష ప్రయోగం తర్వాత జర్మనీలో చికిత్స తీసుకున్న అనంతరం తొలిసారి సొంత దేశానికి తిరిగి వెళ్లారు. 
 
విమానాశ్రయంలో జర్నలిస్టులతో మాట్లాడుతూ రష్యాకు తిరిగి రావడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఏమాత్రం పశ్చాత్తాప పడడం లేదని స్పష్టం చేశారు. గత ఐదు నెలల్లో తనకు ఇదే అత్యంత శుభదినమని వ్యాఖ్యానించారు. గత వారమే నావెల్నీ రష్యాలో అడుగుపెడితే అరెస్టు చేస్తామని అక్కడి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 
 
పుతిన్ కు బలమైన రాజకీయ ప్రత్యర్థిగా పేరొందిన ఆయన విష ప్రయోగం అనంతరం  తీసుకొన్న అనంతరం, ఐదు నెలల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు. నావెల్నీ నిధుల దుర్వినియోగం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు ఆయనపై మరో మూడు కేసులు కూడా ఉన్నాయి. మరోవైపు నావెల్నీ అరెస్టుని వివిధ దేశాలు ఖండించాయి. ఆయన్ని వెంటనే విడుదల చేయాలని అమెరికా, ఐరోపా సమాఖ్య డిమాండ్‌ చేశాయి.