19న సుప్రీం కోర్ట్ కమిటీ తొలి భేటీ 

నూతన సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమిత నిపుణుల కమిటీ తొలి భేటీ ఈనెల 19న జరగనున్నట్లు కమిటీ సభ్యుడు అనిల్‌ ఘన్వాత్‌ తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణను ఈ సమావేశంలోనే సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. కమిటీ సభ్యుల్లో ఒకరైన భుపిందర్‌ సింగ్‌ కమిటీ నుండి నిష్క్రమించిన విషయం విధితమే. 
 
ఈలోగా సుప్రీంకోర్టు మరో సభ్యుడిని సూచించని పక్షంలో డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ జోషీ, అశోక్‌ గులాటీలతో కలిసి ముగ్గురే భేటీ అవుతామని అనిల్‌ ఘన్వాత్‌ పేర్కొన్నారు. జనవరి 21 నుండి తమ పని ప్రారంభిస్తామని వెల్లడించాయరు. ప్రభుత్వంతో చర్చలపై ఎలాంటి అభ్యంతరమూ లేదని, పరిష్కారం ఎక్కడ దొరికినా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. 
 
మరోవైపు నూతన చట్టాలను రద్దు చేసే వరకూ తమ ఉద్యమం ఆగదని, ప్రభుత్వం స్పందించకపోతే మే 2024 వరకైనా ఉద్యమం చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకులు రాకేశ్‌ తికాయిత్‌ పేర్కొన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలిగించే వరకూ పోరాడుతూనే ఉంటామని తెలిపారు. చట్టాల అమలపై స్టే ఇవ్వడం కాదని, పూర్తిగా చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ధనిక రైతుల ఉద్యమం అంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు.