పంచాయత్ ఎన్నికల తక్షణ స్టే కు సుప్రీం విముఖత 

 పంచాయతీ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి తక్షణ ఉపశమనం పొందాలన్న వై ఎస్  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ లో ఊరట లభించలేదు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించలేదు. ప్రభుత్వ న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ తోసిపుచ్చారు.

 గురువారం  హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే అదే రోజు రాత్రి ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. శనివారం ఎన్నికలకు నోటిఫికేషన్‌ రానుండడంతో శుక్రవారమే అత్యవసరంగా విచారణ జరిపించాలని ప్రభుత్వ న్యాయవాదులు భావించారు. శుక్రవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ధర్మాసనం ముందు కేసును ప్రస్తావించడానికి సిద్ధమయ్యారు.

 ప్రస్తుతం సుప్రీం కోర్టు ‘వర్చువల్‌’ విధానంలో విచారణ జరుపుతున్నందున పిటిషన్ల ప్రస్తావనలకు సమయం కోరుతూ ఈ-మెయిల్‌, వాట్సప్‌ ద్వారా న్యాయవాదులు సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి సందేశం పంపించారు. అత్యవసర విచారణ కోరుతూ ఇంటర్‌ లొకేటరీ అప్లికేషన్‌ కూడా దాఖలు చేశారు. వీటికి రిజిస్ట్రీ నుంచి స్పందన రాలేదు. 

ఉదయం 11 గంటలకు ధర్మాసనం ముందుకు వచ్చిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్త మ ముందున్న జాబితాలో ఉన్న కేసుల విచారణను పూర్తి చేసి మధ్యాహ్నం 12.45 గంటలకు వెళ్లిపోయారు. దీంతో ప్రభుత్వ పిటిషన్‌ గురించి ప్రస్తావించే అవకాశం న్యాయవాదులకు లభించలేదు.

పిటిషన్‌పై విచారణకు శుక్రవారం సాయంత్రం మరోసారి ప్రభుత్వ న్యాయవాదులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో అత్యవసరగా విచారించాలని, హౌస్‌ మోషన్‌ ద్వారా పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు ప్రభుత్వ న్యాయవాదులు లేఖ రాశారు.

 రాత్రి 7 గంటలకు దీనిపై రిజిస్ట్రార్‌ జనరల్‌ హౌస్‌ మోషన్‌కు కుదరదని తెలిపారు. ఈ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది. కాగా, ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో 13 లోపాలున్నట్లు కోర్టు గుర్తించింది. ముఖ్యంగా పలు పేజీలకు నెంబర్లు లేవని తెలిపింది. ఈ లోపాలను సాయంత్రానికి న్యాయవాదులు సరిదిద్దారు.

మరోవంక, ఉద్యోగ సంఘాల నేతలు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మూడు నెలల పాటు ఎన్నికల నిర్వహణను వాయిదా వేయాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ పిటిషన్‌లో ఉద్యోగ సంఘం నేత ఎస్‌కే మస్తాన్‌ వలీ ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం కరోనా కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బంది నిమగ్నమై ఉన్నారని తెలిపారు.

Panc