సరిహద్దుల నుండి ఖాళీ చేయమని రైతులకు ఆదేశాలు 

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో హింస చెలరేగిడంతో రాజధాని ప్రాంతంలో భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌లోని రైతు శిభిరాల వద్ద భారీగా పోలీసు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. ఘాజీపూర్‌, సింఘు, టిక్రీ సరిహద్దులను ఖాళీచేయాలని ఇప్పటికే బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌, హర్యానా ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నది. 
ఘాజీపూర్ సరిహద్దులో రెండు నెలలుగా నిరసనలు జరుపుతున్న రైతులను రాత్రికి ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఘజియాబాద్ జిల్లా అధికారులు గురువారం సాయంత్రం  ఆదేశాలు జారీచేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం, తాము ఖాలీ చేయబోమని నిరసనకారులు స్పష్టం చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.  
పోలీసులు ఖాళీ చేయించే అవకాశం ఉన్నాడని రైతులు రాత్రంతా మెలకువతోనే ఉండి నిరసనలో పాల్గొన్నారు. ముందు నిరసనను విరమించుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ గురువారం భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ భావోద్వేగ ప్రసంగం అనంతరం ఘాజీపూర్ సరిహద్దులో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అర్థరాత్రి పెద్ద ఎత్తున రైతులు ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకోవడం ప్రారంభించారు.
జనవరి 26న ఎర్రకోట వద్ద జరిగిన ఉదంతం రైతు ఉద్యమంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇప్పటికే ఆరు రైతు సంఘాలు ప్రస్తుతం కొనసాగుతున్న నిరసన నుంచి తప్పకుంటుంటున్నట్లు ప్రకటించాయి. అయితే ఈ నిరనసలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నాయి. ఈ ప్రకటన అనంతరం మిగతా రైతు సంఘాలు కూడా నిరసన విరమించేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 1న పార్లమెంట్ మార్చ్‌ను కూడా రద్దు చేసుకున్నాయి.
గురువారం సాయంత్రం నిరసన ప్రదేశాలను ఖాళీ చేయించాలని ఉత్తరప్రదేశ్‌లోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి  యోగి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం యూపీ-ఢిల్లీ సరిహద్దుల్లోకి వేలాదిగా పోలీసు బలగాలు చేరుకుని నిరసన ప్రదేశాలను ఖాళీ చేయించేందుకు సిద్ధమయ్యాయి. ఈ చర్యల్ని నిరసిస్తూ తాను ఆత్మహత్యకు అయినా సిద్ధమే కానీ నిరసన విరమించేది లేదని రాకేశ్ టికాయత్ ప్రకటించారు.
ఘజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ అజయ్ శంకర్ పాండే, సీనియర్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ కళానిధి నైతని గత సాయంత్రం నిరసన శిబిరాలవద్దకు చేరుకొని, పరిస్థితులను సమీక్షించడంతో తమను ఖాళీ చేయించవచ్చనే భయంతో రాత్రంతా సమీప జిల్లాల నుండి రైతులు అక్కడకు చేరుకోవడం ప్రారంభించారు. అయితే అదనపు పొలిసు బలగాలను అక్కడి నుండి ఉపసంహారిన్చుకున్నామని, కనీస సంఖ్యలోనే ఉన్నారని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
కాగా, ఘాజీపూర్‌ సరిహద్దును పోలీసులు మూసివేశారు. దీంతో ఎన్‌హెచ్‌ 24, ఎన్‌హెచ్‌ 9, రోడ్‌ నంబర్‌ 56, 57ఏ, కోండ్లి, పేపర్‌ మార్కెట్, టెల్కో టీ పాయింట్‌, ఈడీఎం మాల్‌, అక్షర్‌ధామ్‌, నిజాముద్దీన్‌ కట్ట ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను మళ్లిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంతోపాటు, వికాస్‌ మార్గ్‌లో భారీగా ట్రాఫిక్‌ వాహనాలు స్తంభించిపోయాయి. 
 
అదేవిధంగా సింఘు, ఔచండీ, మంగేష్‌, సబోలి, పియౌ మణియారి సరిహద్దులను పోలీసులు మూసివేశారు. లాంపూర్‌, సఫియాబాద్‌, సింఘు స్కూల్‌, పల్ల టోల్‌ట్యాక్స్‌ సరిహద్దులను తెరిచారు. ఈనేపథ్యంలో డీఎస్‌ఐడీసీ నరేలా ప్రాంతం సమీపంలో ఎన్‌హెచ్‌ 44పై వాహనాలను మళ్లించారు.